బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎలాంటి మార్పు రాదు: కిషన్ రెడ్డి

BJP Kishan Reddy Comments - Sakshi

హైదరాబాద్‌: ఈ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్ కు సంబంధించినవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్.. కు ఓటేస్తే నష్టమే తప్ప ఎలాంటి మార్పు రాదని అన్నారు. కుటుంబ, అవినీతి పాలనను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు సాగిస్తున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాల్లో, జనసేన నుంచి 8 మంది బరిలో ఉన్నారని చెప్పారు. బీజేపీ తరుపున నామినేషన్ వేసిన వారు దాదాపు ఉపసంహరించుకున్నారని తెలిపారు.

రాష్ట్రంలో 10 రోజులుగా బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని కిషన్ రెడ్డి అన్నారు. కొందరు దొంగ కంపెనీల పేరిట సర్వేలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంట్లో కూర్చుని సర్వే నివేదికలు రిలీజ్ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, జనసేన తరపున భారీ మొత్తంలో  బీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. బీజేపీ 36 మంది, జనసేన నుంచి ముగ్గురు బీసీ అభ్యర్థులు ఉన్నారని వెల్లడించారు. రెండు జనరల్ స్థానాల్లో కూడా దళితులకు అవకాశం ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్  22 మంది బీసీలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చిందని తెలిపిన కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ 23 మంది బీసీలకు మాత్రమే టికెట్ ఇచ్చిందని పేర్కొన్నారు. 

గజ్వేల్ లో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ రెండు సీట్లలో పోటీ చేస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఈటల బరిలో ఉంటున్నానని చెప్పినప్పటి నుంచి ఆయనకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. కామారెడ్డిలోనూ వెంకటరమణ రెడ్డి చేతిలో ఓడిపోతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు బానిస బతుకు మాత్రమే మిగిలిందని అన్నారు.

సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే దేశాభివృద్ధి జరగదని కిషన్ రెడ్డి అన్నారు. సంకీర్ణం జరిగితే కేసీఆర్ వెంట వచ్చే ఏకైక పార్టీ ఎంఐఎం అని తెలిపారు. ఈ నెల 17న  అమిత్ షా తెలంగాణకు వస్తున్నారని తెలిపిన తెలిపిన కిషన్ రెడ్డి.. 18న నాలుగు జిల్లాల్లో సభలు ఉంటాయని వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని పేర్కొన్నారు. రోజ్ గార్ మేళాలాగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఖాళీలు భర్తీ చేసి రాష్ట్ర నిరుద్యోగులకు నియామకపత్రాలు అందజేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: 2024లో సంకీర్ణ సర్కారు ఖాయం.. బీఆర్‌ఎస్‌దే హవా: సీఎం కేసీఆర్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top