లూటీ అయిన రాష్ట్రాన్ని గాడిలోకి తెస్తున్నాం | Bhatti Vikramarka Inaugurated New Substations At Nagarkurnool District | Sakshi
Sakshi News home page

లూటీ అయిన రాష్ట్రాన్ని గాడిలోకి తెస్తున్నాం

May 27 2025 5:39 AM | Updated on May 27 2025 5:40 AM

Bhatti Vikramarka Inaugurated New Substations At Nagarkurnool District

గట్టుతుమ్మన్‌లో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టిని సత్కరిస్తున్న దృశ్యం. చిత్రంలో మంత్రి జూపల్లి

తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం

సంపద సృష్టించి ప్రజలకు పంచుతాం

త్వరితగతిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాం

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి

నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

అచ్చంపేట/ఆమనగల్లు: ‘ప్రజాప్రభుత్వంలో సమగ్ర ప్రణాళికతో సంపద సృష్టించి ప్రజలకు పంచుతాం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేసింది. మేము గాడిలోకి తెచ్చి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం. ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. మేం తెచ్చిన ప్రతి పథకం దేశానికి రోల్‌ మోడల్‌గా నిలుస్తోంది.. ఇప్పటికే మీ మోడల్‌ మాకు చెప్పండంటూ ఇతర రాష్ట్రాలు అడుగుతున్నాయి’అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలంలోని గట్టుతుమ్మన్‌ గ్రామంతోపాటు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. 

కులగణనతో దేశానికే ఆదర్శంగా నిలిచాం 
గట్టుతుమ్మన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ కులగణన 50 రోజుల్లో పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలున్నాయని ఆయన కుమార్తె కవిత ఇప్పుడు చెబుతోందని.. కానీ రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లోనే ఈ దెయ్యాలను వదిలించుకొని ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని భట్టి ఎద్దేవా చేశారు. రెండు దశాబ్దాలపాటు రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన ప్రణాళికను తాము తయారు చేస్తున్నామన్నారు. 

కాంగ్రెస్‌ వస్తే కరెంట్‌ పోతుందని కేసీఆర్‌ దు్రష్పచారం చేశారు.. 
‘మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల కేసీఆర్‌ వద్దకు ఎవరూ రావట్లేదని ఆయన బాధపడుతున్నారు. కాంగ్రెస్‌ వస్తే కరెంట్‌ పోతుందని కేసీఆర్‌ దు్రష్పచారం చేశారు. అప్పట్లో మేము సవాల్‌ చేశాం. చెప్పినట్లుగానే డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుదుత్పత్తి చేస్తున్నాం’అని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా మరో 50 ఏళ్ల విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోందని భట్టి చెప్పారు. 2029–30 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్‌ పవర్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో భవిష్యత్‌ తరాలకు మిగులు విద్యుత్‌ అందిస్తామని.. ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను అమ్మే స్థాయికి ఎదుగుతామని పేర్కొన్నారు. 

సంక్షేమానికి ఏటా రూ.70 వేల కోట్లు 
రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఏటా రూ. 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో రూ. 200 కోట్లతో నిర్మించనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్, రూ. 18 కోట్లతో నిర్మించనున్న 8 విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేసి సాగునీరు అందించడమే ప్రజాప్రభుత్వ ఎజెండా అని తెలిపారు.

పెండింగ్‌లో ఉన్న రిజర్వాయర్ల భూసేకరణ నిధులను వెంటనే విడుదల చేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, మధుసూదన్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వనితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

విద్యుత్‌ కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా
దేశ చరిత్రలోనే ఓ రికార్డు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్‌/హన్మకొండ: విద్యుత్‌ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌పీడీసీఎల్‌) పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేశ్‌ కుటుంబ సభ్యులకు సోమవారం ప్రజాభవన్‌లో కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కుతో పాటు విద్యుత్‌ శాఖలో నరేశ్‌ శ్రీమతికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసిన సందర్భంగా భట్టి మాట్లాడారు.

విద్యుత్‌ కార్మికునికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందించడం కేవలం సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సాధ్యమైందన్నారు. గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచన, ప్రయత్నం చేయలేదని చెప్పారు. ప్రమాద బీమా, కారుణ్య నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు, మానవీయ కోణానికి అద్దం పడుతోందని, విద్యుత్‌ ఉద్యోగులు అంకితభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ సీఎం కోరారు. ప్రభుత్వ ఆలోచనను సమర్థవంతంగా అమలు చేసిన ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డిని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి విద్యుత్, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement