కేసీఆర్‌ కుటుంబాన్ని అరెస్ట్‌ చేసే దమ్ముందా?

Bandi Sanjay challenge to Congress party - Sakshi

ప్రజాహితయాత్రలో కాంగ్రెస్‌కు ఎంపీ బండి సంజయ్‌ సవాల్‌

వేములవాడ: కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడానికి కారకులైన కేసీఆర్‌ కుటుంబాన్ని అరెస్టు చేసే దమ్ము కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఉందా ? అని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. ప్రజాహితయాత్రలో భాగంగా సోమవారం రాత్రి వేములవాడకు చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎల్‌అండ్‌టీ సంస్థను బెదిరించి సబ్‌కాంట్రాక్టు తీసుకొని పనులు చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలన్నారు.

కాంగ్రెస్‌ వారు మేడిగడ్డను టైంపాస్‌గా చూసేందుకో, పిక్నిక్‌ స్పాట్, వాటర్‌ఫాల్స్‌ చూడటానికి వెళ్లినట్టు ఉండొద్దని సూచించారు. రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేసిన కేసీఆర్‌ కుటుంబం ఆస్తుల జప్తు చేయాలని కోరారు. మేడిగడ్డపై కాంగ్రెస్‌ ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. వేములవాడలో సంజయ్‌ సరదాగా ఆటో నడిపారు. ఆయన పక్కనే బీజేపీ నేత డాక్టర్‌ వికాస్‌రావు కూర్చున్నారు.  

ఒంటరిగానే బరిలోకి దిగుతాం.. 
పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని బండి సంజయ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునే ఖర్మ తమకు లేదని స్పష్టం చేశారు. వేములవాడరూరల్‌ మండలం చెక్కపల్లి, నూకలమర్రి, నమిలిగుండుపల్లి, వట్టెంల, శాత్రాజుపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజాహితయాత్రలో ఆయన మాట్లాడారు.

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top