విద్యుత్‌పై టీడీపీ అనవసర రాద్ధాంతం | Balineni Srinivasa Reddy comments on Chandrababu about electricity | Sakshi
Sakshi News home page

విద్యుత్‌పై టీడీపీ అనవసర రాద్ధాంతం

Feb 6 2022 4:27 AM | Updated on Feb 6 2022 4:29 AM

Balineni Srinivasa Reddy comments on Chandrababu about electricity - Sakshi

ఒంగోలు సబర్బన్‌: విద్యుత్‌ విషయంలో తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా విద్యుత్‌ కోతలు లేవని చెప్పారు. సాంకేతిక సమస్య కారణంగా రెండు రోజులుగా కొంతమేర విద్యుత్‌ సమస్య నెలకొందన్నారు. దీనిని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి విద్యుత్‌ సంస్థల మెడకు బకాయిల బండను కట్టి వెళ్లారని ధ్వజమెత్తారు. ఆ భారాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో విద్యుత్‌ సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. మంత్రి బాలినేని ఇంకా ఏమన్నారంటే.. 

ఎన్‌టీఆర్‌పై బాబుకు దొంగ ప్రేమ 
► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఒక జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ పేరు పెట్టడం ద్వారా ఆయనకు గౌరవం కల్పించారు. చంద్రబాబు మాత్రం ఓట్ల కోసమే ఎన్‌టీఆర్‌కు దండం పెడుతున్నాడు. మనసులో ఏమాత్రం ప్రేమ ఉండడు. పైకి చూపించేదంతా దొంగ ప్రేమ.  
► తను ముఖ్యమంత్రిగా పని చేసి కూడా.. ఒక జిల్లాకు ఎన్‌టీఆర్‌ పేరు ఎందుకు పెట్టలేదో సినీ నటుడు బాలకృష్ణ తన బావ చంద్రబాబును నిలదీయాలి. ఆ పని చేయకుండా పుట్టపర్తి జిల్లా విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.  
► రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు, సత్య సాయిబాబాకు దేశ, విదేశాల్లో ఉన్న ప్రేమ పూర్వక, మంచి పేరును దృష్టిలో ఉంచుకొని సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టపర్తిని జిల్లాగా ప్రకటించారు.   
► ఉద్యోగులతో జరుపుతున్న చర్చలు తప్పక ఫలిస్తాయి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కాపులకు ఎన్నో రకాలుగా మేలు చేస్తోంది. చంద్రబాబు కేసులు పెట్టి వేధిస్తే, సీఎం వైఎస్‌ జగన్‌ ఆ కేసులు ఎత్తివేశారు.  
► కొంత మంది వ్యక్తులు వెనుక ఉండి సుబ్బారావు గుప్తాను ప్రోత్సహిస్తున్నారు. ఆయన వ్యవహార శైలి బాగోలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement