ఉద్దానంపై ప్రేమ కాదు.. ఉత్తరాంధ్రపై ఏడుపు.. ఈనాడు, టీడీపీపై మంత్రి మండిపాటు

Appalaraju Fires On Eenadu And TDP Ramoji Rao On Uddanam - Sakshi

విశాఖ పరిపాలన రాజధాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అసత్య కథనాలు 

ఉత్తరాంధ్రకు అన్యాయమంటూ ఈనాడు రాస్తున్నదంతా విష ప్రచారమే 

అందులో భాగమే ఉద్దానంపైనా అసత్య కథనం 

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ, ఈనాడు రామోజీరావుకు ఉద్దానంపై ప్రేమ లేదని, విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందేమోనన్న ఏడుపు మాత్రమే వారిలో కనిపిస్తోందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. విశాఖ పరిపాలన రాజధాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రకు అన్యాయమంటూ ఈనాడు రాస్తున్నదంతా విష ప్రచారమేనని అన్నారు.

అందులో భాగంగానే ఉద్దానంపైనా అసత్య కథనం రాశారని మండిపడ్డారు. మంత్రి అప్పలరాజు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్దానంపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఇక్కడ రక్షిత మంచినీటి ప్రాజెక్టు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నారని, పలు చోట్ల డయాలసిస్‌ యూనిట్లు ఏర్పాటు చేశారని చెప్పారు. కిడ్నీ వ్యాధి వ్యాపించకుండా చర్యలు చేపట్టారన్నారు.

ఇవన్నీ కళ్లెదుట కనిపిస్తున్నా, అసలక్కడ ఏ కార్యక్రమమూ జరగడంలేదన్నట్లుగా ప్రజలను నమ్మించేందుకు అబద్ధపు రాతలు రాస్తున్నారని అన్నారు. అసలు చంద్రబాబు హయాంలో ఉద్దానం ప్రజలను కబళిస్తున్న కిడ్నీ వ్యాధి నివారణకు ఏమి చర్యలు చేపట్టారో చెప్పాలని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఉద్దానం కోసం ఒక్కటైనా చేశారా? దీనికి రామోజీరావు సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఉద్దానంపై వాస్తవాలు వక్రీకరించి అంతులేని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దగ్గర ఈనాడు రామోజీరావు ఎంత ప్యాకేజీ తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

ఉద్యానవనంలా ఉద్దానం 
ఘన చరిత్ర ఉన్న ఉద్దానం టీడీపీ ప్రభుత్వ హయాంలో అధ్వానంగా మారిందని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఉద్దానంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, కిడ్నీ జబ్బులు నయం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపోందించారని తెలిపారు. తుపాన్‌ వల్ల కుదేలైన ఉద్దానానికి ప్రత్యేక పరిహారం అందిచారన్నారు. అక్కడ పంపిణీ చేసిన జీడి, కొబ్బరి చెట్లతో ఉద్దానం ఉద్యానవనంగా మారుతోందని అన్నారు.

వైఎస్‌ జగన్‌ 2017లో కవిటి సభలో చెప్పిన విధంగా తమ ప్రభుత్వం రాగానే అక్కడ రీసెర్చ్‌ సెంటర్, ప్రత్యేకంగా కిడ్నీ ఆస్పత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఉద్దానం కోసం చేసిన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఒక్కటీ లేవన్నారు. ఉద్దానంలో రీసెర్చ్‌ సంస్థ ఏర్పాటు చేస్తానని చెప్పిన చంద్రబాబు  ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. కేజీహెచ్‌ సెంటర్‌గా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పని చేస్తుందన్నారని, అదీ జరగలేదని చెప్పారు.

వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రత్యేకంగా స్పెషలైజ్డ్‌ నెఫ్రాలజీ యూనిట్‌ ఏర్పాటు చేశారని చెప్పారు. అందుకే చికిత్సలో, మందుల సరఫరాలో ఎక్కడా లోపం జరగడంలేదని చెప్పారు. అయినా, ప్రజలను పక్కదోవ పట్టించేలా కథనాలు ప్రచురిస్తున్న ఈనాడును, టీడీపీని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని మంత్రి చెప్పారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top