నేడు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన! | Sakshi
Sakshi News home page

నేడు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన!

Published Thu, Mar 7 2024 1:03 AM

Announcement of Congress Lok Sabha candidates - Sakshi

తుది అంకానికి చేరిన ఎంపిక కసరత్తు

ఢిల్లీలో భేటీ కానున్న కేంద్ర ఎన్నికల కమిటీ

వీలైతే నేడు లేదా రేపు రాష్ట్రంలోని అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.. కనీసం 8 నుంచి 10 స్థానాలకైనా ఖరారు చేస్తారనే చర్చ

సీఈసీ భేటీకి హాజరు కానున్న రేవంత్, భట్టి, ఉత్తమ్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఈ ప్రక్రియలో కీలకమైన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం గురువారం ఢిల్లీలో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ భేటీలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అంబికా సోని పాల్గొననున్నారు.

రాష్ట్రం నుంచి సీఈసీ సభ్యుడి హోదాలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, ఏఐసీసీ ఏర్పాటు చేసిన తెలంగాణ స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు హాజరు కానున్నారు.

ఇప్పటికే పీసీసీల స్థాయిలో షార్ట్‌ లిస్ట్‌ అయిన ఆశావహుల జాబితా నుంచి వీలున్నన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడమే ఎజెండాగా ఈ సమావేశం జరగనుందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. భేటీ అనంతరం దేశవ్యాప్తంగా 100 మందికి పైగా అభ్యర్థులతో వీలుంటే గురువారం నాడే లేదంటే శుక్రవారం తొలి జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది.

ఇక  ఏకాభిప్రాయం సాధ్యమైతే తెలంగాణలోని దాదాపు అన్ని స్థానాలకు (ఒకట్రెండు మినహా) ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తారని, లేదంటే 8 నుంచి 10 మంది అభ్యర్థులను ప్రకటిస్తారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కరీంనగర్, నిజామాబాద్‌ స్థానాలపై ఇప్పటికే ఏకాభిప్రాయం వచ్చిందని తెలుస్తోంది. మిగిలిన స్థానాలపై కూడా సీఈసీ సమావేశంలో చర్చించిన అనంతరం పలు ప్రాతిపదికల ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తారని సమాచారం. 

రాహుల్‌ పోటీపైనా స్పష్టత!
రాష్ట్రం నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తారా లేదా? అన్నదానిపై కూడా ఈ సమావేశంలోనే స్పష్టత రానుంది. ఒకవేళ రాహుల్‌ పోటీ చేసే పక్షంలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఏఐసీసీ అధికారికంగా విడుదల చేసే తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉందని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. కానీ ఏఐసీసీ వర్గాల కథనాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆయన తిరిగి ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, కేరళలోని వయనాడ్‌ రెండింటి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రియాంకగాంధీ.. తల్లి సోనియాగాంధీ ఐదుసార్లు గెలిచిన రాయ్‌బరేలీ నుండి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

హస్తినకు ఆశావహులు
సీఈసీ సమావేశం నేపథ్యంలో టికెట్‌ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందనే అంచనాలున్న స్థానాల్లో తమ అభ్యర్థిత్వాలు ఖరారవుతాయో లేదోననే ఆసక్తితో కొందరు నేతలు ఢిల్లీ చేరుకున్నట్టు సమాచారం. వివిధ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండనున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలున్న తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, పంజాబ్‌ వంటి రాష్ట్రాల నుంచి తొలి జాబితాలో ఎక్కువమందికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది.   

Advertisement
Advertisement