బీజేపీ నుంచి అన్నామలై బయటకు వచ్చేసిన తర్వాత చెన్నై ఈసీఆర్‌లోని ఆయన నివాసం సందడిగా కనపడుతోంది. ఆయన మద్దతుదారులు హడావుడిగా ఫోన్ కాల్స్ చేస్తుండడం, సీరియస్‌గా చర్చల్లో పాల్గొనడం కనిపిస్తున్నాయి. అన్నామలై బీజేపీతో బంధం తెంచుకోవడం చాలా తక్కువ కాలంలో, పెద్ద హడావుడి లేకుండానే ముగిసింది. న్యూఢిల్లీ పర్యటన, పార్టీ అగ్ర నాయకత్వంతో చర్చల అనంతరం అన్నామలై తన రాజీనామాను ప్రకటించారు.
ప్రస్తుతం అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమంలో ఇప్పటివరకు 14 లక్షలకు పైగా సభ్యత్వ నమోదులు జరిగాయి. ఆ సంఖ్య ఇంకా పెరుగుతోంది. జెన్ జీను ఆకర్షించే ప్రయత్నం వెబ్‌సైట్ (wetheleader.org) ప్రారంభంతో మొదలైంది. ఆ వెబ్‌సైట్‌లో పేరును నమోదు చేసుకుని అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమానికి మద్దతు లేదా దానిపట్ల ఆసక్తిని తెలియజేయవచ్చు.
జెన్ జీ యువతలో అన్నామలైకు మద్దతు వేగంగా పెరుగుతోంది. సోషల్ మీడియా వేదికలపై ఆయన సందేశాలకు భారీ స్పందన లభిస్తోంది. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కొత్త తరహా రాజకీయాలను యువత స్వాగతిస్తోంది. "వి ది లీడర్స్" ఉద్యమంలో వారు స్వచ్ఛందంగా చేరుతుండడమే దీనికి నిదర్శనం.
డిజిటల్ వేదిక ద్వారా చేసిన ప్రసంగంలో అన్నామలై మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలను వేధిస్తున్న ప్రాథమిక సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండటంతోనే బీజేపీ నుంచి వైదొలుగుతున్నానని చెప్పారు. “ప్రజలు తరచూ నన్ను అడుగుతుంటారు. మీరు తమిళ వ్యక్తా? లేక భారతీయుడా? అని. నేను ఎప్పుడూ ఒకటే చెబుతాను. నేను గర్వించే భారతీయుడిని. తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాల్లో పెరిగాను” అని చెప్పారు.
వైఖరిని చెప్పేసిన ప్రసంగం
ఆ వీడియో సందేశం, ఆయనతో జరిగిన సంభాషణల ఆధారంగా చూస్తే.. ప్రాంతీయతను పక్కన పెట్టినా స్థానిక ప్రయోజనాలను వదలకుండా, సమైక్య రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే, అధికారంలో ఉన్నవారిని జవాబుదారులుగా నిలబెట్టే కొత్త రాజకీయ వేదికను అన్నామలై నిర్మించబోతున్నట్లు కనిపిస్తోంది.
మరోవైపు, “ఈ ఉద్యమాన్ని ప్రారంభించేందుకు మాకు 3 నెలలు పట్టింది. వి ది లీడర్స్” అని అన్నామలై కొత్త రాజకీయ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన ఓ వ్యక్తి చెప్పారు. ఈ టీమ్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు లేరు. “అన్నామలై ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన 25 మంది ఉన్నారు. వారిలో కొందరు ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రులు, కొందరు ఐఐఎం లక్నోకు చెందినవారు, మరికొందరు సాఫ్ట్‌వేర్ రంగం నుంచి వచ్చినవారు” అని ఆ వ్యక్తి తెలిపారు.
అన్నామలై కొత్త రాజకీయ ప్రయాణంపై అవగాహన ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలిపిన సమాచారం ప్రకారం.. యువతను చేరుకోవాలనే ఉద్దేశంతో అన్నామలై ఇప్పుడు సాంప్రదాయ మాధ్యమాలను పక్కన పెట్టి సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇదే విధానం టీవీకేకు మంచి ఫలితాలు ఇచ్చింది. సాధారణంగా నిర్వహించే పత్రికా సమావేశానికి బదులుగా, ఈ సారి తన ప్రణాళికను నేరుగా ప్రజలకు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా తెలియజేయాలని ఆయన నిర్ణయించారు.
జాతీయవాదం+తమిళ గుర్తింపు
అన్నామలై టీమ్‌లో ఉన్నవారు మాట్లాడుతూ.. “మా నాయకుడి సిద్ధాంతం జాతీయవాదం-తమిళ గుర్తింపు/తత్వం కలయికగా ఉంటుంది. అవసరమైతే బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానైనా ప్రజా సమస్యలను లేవనెత్తుతాం” అన్నారు. మూడు భాషల విధాన అమలుకు వ్యతిరేకంగా అన్నామలై చేసిన ట్వీట్ దీనికి ఉదాహరణ.
విజయ్‌కు పోటీగా నిలిచే, ప్రజలను ఆకర్షించే నాయకుడి స్థానం ఖాళీగా ఉందని అన్నామలై భావిస్తున్నారు. ఆ ఖాళీని తాను భర్తీ చేయగలనని అన్నామలై నమ్ముతున్నారు.
2031 తమిళనాడు ఎన్నికలు లక్ష్యం
రానున్న కొన్ని నెలల్లో ప్రజలతో, ముఖ్యంగా యువతతో మరింతగా మమేకమవడం, “వి ది లీడర్స్” అనే వెబ్‌సైట్‌లో లక్షలాది సభ్యులను చేర్చుకోవడం, 2031 తమిళనాడు ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకోవడం అన్నామలై ప్రణాళికగా సోర్సెస్ తెలిపాయి.
తన కొత్త రాజకీయ ప్రయాణంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని వర్గాలు సూచిస్తున్నాయి. రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ కూడా ఇలాంటి ఉద్యమాన్ని ప్రకటించారు.
తమిళనాడు స్పష్టంగా కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది. కొత్త వ్యక్తులు రాజకీయ చర్చలను ప్రభావితం చేస్తున్నారు. ఒకవైపు సి జోసెఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. అధికారిక రాజకీయ ప్రవేశం చేసిన 28 నెలల్లోనే అధికారంలోకి వచ్చి అసాధ్యాన్ని సాధించారు.
మరోవైపు ద్రావిడ పార్టీలు ఉన్నాయి. వాటిలో ప్రతీదానికి అంతర్గత సవాళ్లు ఉన్నా, గత 6 దశాబ్దాలుగా సంపాదించుకున్న ప్రజా మద్దతుపై అవి ఆధారపడుతున్నాయి.
సామాజిక మాధ్యమాల యుగంలోకి మనం మరింతగా ముందుకు వెళ్తున్నాం. అక్కడ క్యాన్సల్ కల్చర్ (ప్రజా వ్యతిరేకత కారణంగా వ్యక్తులు లేదా సంస్థలను సామాజికంగా తిరస్కరించే ధోరణి), ఎవరినీ విడిచిపెట్టకుండా చేసే విమర్శలు చురుకుగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన గౌరవాన్ని సంపాదించి, దాన్ని నిలబెట్టుకోగలరా? దానికి సమాధానం కాలమే చెబుతుంది.


