
గాంధీభవన్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిని తప్పుబడుతూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, సాక్షి: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొందరు ఎమ్మెల్యేలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నలుగురైదుగురు గ్రూపులు కడితే భయపడతాం అనుకుంటున్నారా?. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను నేనూ రాహుల్ అసలు పట్టించుకోం. వాళ్ల సంగతి పార్టీ క్రమశిక్షణా కమిటీ తేలుస్తుంది. అందుకే పార్టీ నేతలు ఇష్టానుసారం మాట్లాడొద్దు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఒకే తాటిపై నిలవాలి’’ అని సున్నితంగా హెచ్చరించారు.
మరో సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా తరచూ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న నేతలకు చురకలంటించారు. ‘‘కాంగ్రెస్‌లో కొంత మంది నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మన ప్రతీ మూమెంట్ ప్రజలు గమనిస్తారు. అందుకే ఆచితూచి వ్యవహరించాలి. మీ వ్యవహార శైలితో పార్టీకి కొత్త నష్టం చేస్తే ఊరుకోం. పార్టీ ఉంటేనే మీరుంటారు. సొంత ఎజెండాతో పనిచేసే వారిపై వేటు తప్పదు. పార్టీ, ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలి. జిల్లాల వారీగా ఆశావహుల లిస్టును పీసీసీ సిద్ధం చేయాలి అని సూచించారు.
ఈ మీటింగ్ వేదికగా.. పార్టీ పదవులు, ప్రభుత్వ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే టీపీసీసీకి డెడ్ లైన్ విధించారు. ‘‘ఈ నెల 30 లోపు పోస్టులన్నీ భర్తీ చేయాలి. పదవులు భర్తీ కాకుంటే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దే బాధ్యత’’ అని ఖర్గే అన్నారు. ఆ సమయంలో సీఎం రేవంత్ కలగజేసుకుని ఇంచార్జీ మంత్రులు బాధ్యత తీసుకొని పదవుల భర్తీ కోసం లిస్టులు టీపీసీసీ చీఫ్‌కు పంపాలని చెప్పారు. ఆ వెంటనే ఖర్గే మరోసారి ‘పార్టీలో పనిచేసిన వారికి.. అర్హత ఉన్నవాళ్లకే పదవులు ఇవ్వాలి’’ అని సూచించారు.
టీపీసీసీ విస్తృత స్థాయి, కార్యవర్గ సమావేశాల్లోనూ ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించారు. మేనిఫెస్టో అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ కృషి అభినందనీయం. హామీలను అమలు చేసే ఏకైక పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ లో పరిపాలన బావుంది, పార్టీ కార్యకర్తల పనితీరు బావుంది. పార్టీ మీ అందరికీ ఇచ్చిన పదవులను సద్వినియోగం చేసుకోవాలి. 50 ఏళ్ల క్రితం జరిగిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు.. 11 ఏళ్ల వారి పాలనలోని ఎమర్జెన్సీ పరిస్థితులు గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని ఖర్గే ప్రసంగించారు.
జడ్చర్ల ఎమ్మెల్యేపై పీసీసీ చీఫ్ ఆగ్రహం
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణా కమిటీని పీసీసీ చీఫ్ ఆదేశించారు. సోమవారం జరగబోయే క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఈ నోటీసులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.