ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామికి భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు చేసి పట్నాలు వేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి నుంచి కూడా భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చారు. తొలుత కోనేరులో స్నానాలు ఆచరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మల్లికార్జునస్వామి, శ్రీసీతారామచంద్రస్వామి, నందీశ్వరులను దర్శనం చేసుకున్నారు. ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించి, బోనాలతో నైవేద్యం సమర్పించారు.
పరిశుభ్రతతో ఆరోగ్యం
పెద్దపల్లిరూరల్: పరిసరాలతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉంటామని ప్రభు త్వ బాలుర జూనియర్ కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు సూచించారు. అప్పన్నపేట గ్రామంలో ఆదివారం జరిగిన శీతాకాల శిబిరంలో సంక్షేమ పథకాలు, ఆరోగ్యసూత్రాలు పాటించడంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. శుద్ధమైన నీటిని తాగాలని సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి సదయ్య, అధ్యాపకుడు రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు.
హోరాహోరీగా క్రీడా పోటీలు
సుల్తానాబాద్‌రూరల్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల క్రీడా పోటీలు ఆదివారం హోరాహోరీగా సాగాయి. ఈనెల 12వ తేదీ నుంచి అండర్–14, అండర్–17లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ హెన్రీ తెలిపారు. సోమవారం ఫైనల్ మ్యాచ్‌ల తర్వాత ముగింపు వేడుకలు నిర్వహిస్తామని, ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన క్రీడా జట్లకు బహుమతులు ప్రదానం చేస్తామని ప్రిన్సిపాల్ వివరించారు.
గుట్టను తొలచి.. మట్టి తరలించి..
రామగుండం: అంతర్గాం మండలం మద్ధిర్యాల శివారులో కొంతకాలంగా గుట్టను తొలగిస్తూ మట్టి విక్రయిస్తున్నారు. ఖాళీస్థలాన్ని సాగుకు యోగ్యంగా తయారు చేసుకుంటున్నారు. సర్వే నం.98, 99 శివారు ప్రభుత్వ భూమిలోగల గుట్టను మరో గ్రామ ప్రజాప్రతినిధి జేసీబీ సాయంతో మట్టి తొలగిస్తూ టిప్పర్లలో తరలించి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. మద్ధిర్యాల సర్పంచ్ ముక్కెర రాజమౌళికి సమాచారం తెలియడంతో తవ్వకాలు నిలిపివేసినట్లు తెలిసింది. ఈ విషయమై అంతర్గాం తహషీల్దార్ ప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. అక్రమంగా మట్టి తరలిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. మైనింగ్ అధికారులకు సమాచారం అందించడంతో వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.
పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలి
పెద్దపల్లి: కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం (సీ పీఎస్)ను రద్దు చేసి, పాత పింఛన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చే స్తూ డిసెంబర్ 12న న్యూఢిల్లీలో నిర్వహించను న్న కర్మచారి ఆక్రోశ్ ర్యాలీకి ఉద్యోగులు తరలిరావాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, కార్యదర్శి అయిరెడ్డి సందీప్‌రెడ్డి కోరా రు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాంలీలా మైదానంలో జరిగే ర్యాలీలో దేశవ్యాప్తంగా ఉద్యోగులు పాల్గొననున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.


