గోదావరిఖని: రామగుండం నగరంలోని గంగానగర్ సమీప జీడీకే–1 గని పరిసరాల్లో రూ.14కోట్ల అంచనా వ్యయంతో గ్రావిటీ వాటర్ ఫిల్టర్ ప్లాంట్ పనులు ప్రారంభించారు. రోజూ 35 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధిచేసి ఆర్జీ–1, 2, 3 ఏరియాల్లోని గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీ కార్మిక కుటుంబాలకు సరఫరా చేయాలనేది లక్ష్యం. ప్లాంట్ అనుబంధ పనులు ఇంకా పూర్తికాలేదు. ఇందులో వాటర్ చాంబర్లు, ప్రహరీ, సబ్‌స్టేషన్, రహదారులు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం మరిన్ని నిధులు అవసరమని అంటున్నారు.
సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పరిస్థితీ అంతే..
కార్మికవాడల నుంచి వెలువడుతున్న మురుగునీటిని శుద్ధి చేసేందుకు సింగరేణి యాజమాన్యం సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మిస్తోంది. కాలువల ద్వారా వస్తున్న నీటిని శుద్ధి చేసేందుకు దీనిని నెలకొల్పుతున్నారు. ఆర్థిక వనరుల కొరతతో పనులు మందగించాయి. సమీపంలోని ఆర్జీ –వన్ ఏరియా ఆధ్వర్యంలో జీడీకే–2వ గని సమీపంలో రూ.17.64కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. ప్రతీరోజు 17ఎంఎల్‌డీ(మిలియన్ లీటర్స్ ఫర్ డే) సామర్థ్యంతో పనులు చేపట్టారు. 98శాతం నిర్మాణం పూర్త య్యింది. ఈలోగా టెండర్ గడువు ముగిసింది.
వేధిస్తున్న సిమెంట్, స్టీల్ కొరత
సింగరేణిలో నిర్మాణాలకు వినియోగించే సిమెంట్, స్టీల్ కొరత తీవ్రంగా ఉంది. సకాలంలో సిమెంట్ అందక కార్మికవాడలు, గనులపై కూడా అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. భారీ వంతెనలు, రోడ్లు, కల్వర్టుల నిర్మాణంలో వినియోగించే సిమెంట్ సకాలంలో అందకపోవడంతో అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతోంది. సింగరేణిలోని అన్ని ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు.
నిధుల కొరతే కారణం..
సింగరేణి కార్మిక కుటుంబాలకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతోపాటు పారిశుధ్యం నిర్వహణ, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి పనులు నిధుల కొరతతో నిలిచిపోతున్నాయి. కార్మికులు, వారి కుటుంబాల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతకు కీలకమైన వాటర్ గ్రావిటీ ఫిల్టర్, సీవరేజ్‌ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు పూర్తికాకపోవడంతో ఆశించిన ప్రయోజనాలు రావడంలేదు. యాజమాన్యం లక్ష్యం నెరవేరవడంలేదు. అభివృద్ధి పనులకు నిధుల కొరత అడ్డంకిగా మారి సంక్షేమం గాడితప్పుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కార్మిక సంక్షేమంపై సింగరేణి నిర్లక్ష్యం
అసంపూర్తిగా వాటర్ గ్రావిటీ ఫిల్టర్
కొనసా..గుతున్న ఎస్‌టీపీపీ పనులు
యాజమాన్యాన్ని వేధిస్తున్న సిమెంట్


