హమాలీలకు సంక్షేమ బోర్డు అవసరం | - | Sakshi
Sakshi News home page

హమాలీలకు సంక్షేమ బోర్డు అవసరం

Oct 26 2026 12:16 AM | Updated on Oct 26 2026 12:16 AM

● విదేశీ ఉద్యోగాల కోసం పెద్దపల్లిలోనే శిక్షణ

● కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి

పెద్దపల్లి: హమాలీలు, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. తెలంగాణ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ దశాబ్ది ఉత్సవాలు ఆదివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ, హమాలీలకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ఆరోగ్య పరీక్షలు, సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికుల పిల్లలకు విదేశాల్లో మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జర్మన్‌ వంటి విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చేందుకు పెద్దపల్లి నుంచే పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. పెద్దపల్లిలో హమాలీ సంఘానికి ప్రభుత్వ స్థలం కేటాయించి భవనం నిర్మిస్తామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హామీ ఇచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు పార్లమెంటులో గళమెత్తుతానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. హమాలీ కార్మికుల సంక్షేమాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ కోదండరాం కోరారు. సర్‌తో అనేకమంది ఓట్లు కోల్పోయారని, ఓటుహక్కు లేని వర్క్‌, రేషన్‌కార్డులు, ఇళ్లు ఉండవని, ఆత్మగౌరవంతో బతకాల్సిన అవసరం అందరిపై ఉందని ఆయన చెప్పారు. రాహుల్‌ గాంధీకి మద్దతుగా పోరాటంలో పాల్గొనాలని కోరారు. తెలంగాణ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం అధ్యక్షత వహించగా, కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, హమాలీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement