రామగిరి: పిల్లల చదువులు, ఇంటి నిర్మాణం కోసం, అనారోగ్య సమయంలో ఆదుకుంటుందని దాచిన పొదుపు సొమ్మును అధిక రాబడి ఆశతో పెట్టుబడిగా పెడితే అదే కుటుంబానికి భారంగా మారే ప్రమాదం ఉంది. పరిచయస్తులు చెప్పారని, ప్రతీనెల మంచి ఆదాయం వస్తుందని నమ్మి డబ్బులు అప్పగించిన వారు చెల్లింపులు నిలిచిపోతే ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
షేర్ మార్కెట్ పేరిట సేకరణ..
షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట రామగిరి, యైటింక్లయిన్‌కాలనీ, గోదావరిఖని, ఫెర్టిలైజర్‌సిటీ, ఎన్టీపీసీ ప్రాంతాల్లో కొందరు దళారులు డబ్బులు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. రూ.లక్షకు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు రాబడి ఇస్తామని చెప్పినట్లు సమాచారం. మూడు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయని, సుమారు రూ.50 కోట్ల వరకు సేకరించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నెలకు 6 – 8 శాతం అంటే ఏడాదికి 72 – 96 శాతం ఆదాయం. షేర్ మార్కెట్‌లో లాభనష్టాలు సహజం. ఇంతటి అధిక రాబడిని క్రమం తప్పకుండా ఇస్తామనే హామీ వస్తే అప్రమత్తం కావాలి. రోజంతా కష్టపడే కార్మికులు, చిన్నవ్యాపారులు భవిష్యత్ కోసం దాచిన సొమ్ము తిరిగి రాకపోతే కుటుంబం ఆర్థికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన వారి పరిస్థితి మరింత ఇబ్బందికరం. అందుకే పెట్టుబడికి ముందు లాభం కంటే అసలుకు ఎంత భద్రత ఉందో ఆలోచించాలి.
పెట్టుబడిదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అధిక లాభాల హామీని నమ్మొద్దు. తక్కువ సమయంలో అధిక ఆదాయం అంటే అప్రమత్తం కావాలి. సంస్థ వివరాలు, అనుమతులు, ఆదాయ వనరులను నిర్ధారించుకోవాలి. అప్పు చేసి పెట్టుబడి పెట్టొద్దు. కుటుంబ అవసరాలకు దాచిన సొమ్మును ప్రమాదంలో పడేయొద్దు. పరిచయమే ప్రమాణం కాదు. తెలిసినవారు చెప్పినా సొంతంగా విచారణ చేయండి. బ్యాంకు లావాదేవీలు, రసీదులు, ఒప్పంద పత్రాలు భద్రపరచండి. చెల్లింపులు ఆగితే మరిన్ని డబ్బులు ఇవ్వకుండా అధికారులను సంప్రదించండి. ఆన్‌లైన్ మోసమైతే వెంటనే 1930కు ఫోన్ చేయండి.
ఎవరినీ నమ్మొద్దు
ప్రజలు ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. అధిక లాభాల హామీలను నమ్మి విచారణ లేకుండా డబ్బులు పెట్టుబడి పెట్టొద్దు. మోసపోతే బ్యాంకు లావాదేవీలు, రసీదులతో పోలీసులను సంప్రదించాలి. ఫిర్యాదులపై నిబంధనల ప్రకారం విచారణ చేపడతాం.
– రమేశ్, ఏసీపీ, గోదావరిఖని


