● 20 ఎకరాల్లో బహుళ అంతస్తుల భవనాలు ● ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ● గరంగరంగా బల్దియా సమావేశం
కోల్‌సిటీ: నగరంలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఇందిరమ్మ టవర్లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ తెలిపారు. హైదరాబాద్ తరహాలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తామన్నారు. రామగుండం బల్దియాలో శుక్రవారం జరిగిన రెండోసాధారణ కౌన్సిల్ సమావేశం మేయర్ మహంకాళి స్వామి అధ్యతన జరగ్గా.. ఎమ్మెల్యే ఠాకూర్ హాజరై మాట్లాడారు. ఇందిరమ్మ పథకం ద్వారా ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు, రుణం కింద మరో రూ.5 లక్షలు ఇప్పిస్తామన్నారు. నగర అభివృద్ధికి బల్దియా ద్వారా రూ.600 కోట్లు, ప్రభుత్వ శాఖల ద్వారా మరో రూ.600 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ సంస్థలకు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల సీఎస్సార్ నిధులు గత సర్కార్ నిర్లక్ష్యంతోనే ఇతర ప్రాంతాలకు తరలిపోయాయని ఆ రోపించారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బె డ్రూమ్ ఇళ్లలో తాము రూ.40 కోట్లు వెచ్చించి అనేక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు కేటాయించామని అన్నారు. జీవో 76 ద్వారా ప్రభుత్వ, ఖాళీ స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నవారికి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని తెలిపారు. నగర పరిశుభ్రతో ప్రజలు భాగస్వాం కావాలని ఆయన కోరారు.
31 అంశాలు.. 30 ఆమోదం
ఎజెండాలోని 31 అంశాల్లో నీటి చార్జీల పెంపు మి నహా 30 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే, తమ డివిజన్లలో అభివృద్ధి జరగడం లేదని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు తాళ్ల రాజయ్య, మేకల సమ్మయ్య యాదవ్, ఆకారపు రేఖా, సీపీఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య ప్రస్తావించారు. మేయర్‌తోపాటు కాంగ్రెస్ కార్పొరేటర్లు ముస్తాఫా, నెలకంటి రాము, సాంబమూర్తి తదితరులు స్పందిస్తూ.. గతంతో పోలిస్తే తమ హయాంలోనే అధిక అభివృద్ధి జరిగిందన్నారు. రాజీవ్ రహదారిపై మూడు ప్రాంతాల్లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు నిర్ణయించారు. పర్యాటకులను ఆకర్షించేలా సుందరీకరణ, ల్యాండ్‌స్కేపింగ్, గ్రాఫిటీ పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. మేడిపల్లి సెంటర్ నుంచి పీకే రామయ్యకాలనీ బోర్డు వరకు సుమారు రూ.14.50 కోట్లతో వాతావరణ స్థితిస్థాపక నమూ నా రహదారి నిర్మించనున్నారు. పూర్తయిన 73 అ భివద్ధి పనులకు సుమారు రూ.1.89 కోట్ల బిల్లుల చెల్లింపులకు కౌన్సిల్ నుంచి అనుమతి లభించింది.
అర్బన్ చాలెంజ్ ఫండ్‌తో అభివృద్ధి
అర్బన్ చాలెంజ్ ఫండ్‌తో నగర రూపురేఖలు మారనున్నాయని మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. రూ.120 కోట్లతో స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, రూ.25 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్, రూ.30 కోట్లతో 7.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, రూ.135 కోట్లతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, రూ.152 కోట్లతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, డంపింగ్ యార్డులో బయోమైనింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ తీగలు లాగకుండానే బిల్లులు తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపిస్తామని మేయర్ తెలిపారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ ఆస్తులపై రూ.18 కోట్లు, ఎన్టీపీసీ క్వార్టర్ల నుంచి రూ.20 కోట్ల స్టాంప్ డ్యూటీ బల్దియా ఖాతాలో జమైనట్లు వెల్లడించారు. కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న వీర్లపల్లివాసుల కోసం ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి యత్నిస్తున్నట్లు మేయర్ తెలిపారు. సమావేశంలో డిప్యూ టీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లతోపా టు కమిషనర్ అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.


