ఎన్‌హెచ్– 563పై ఎనిమిది ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు పలుగ్రామాల ఫిర్యాదుల మేరకు ఏర్పాటు ఎఫ్‌వోబీల ఏర్పాటుకు రూ.18 కోట్ల అంచనా వ్యయం వంతెనలు ఎక్కేందుకు మెట్రో తరహా లిఫ్టుల ఏర్పాటు ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందించిన ఎన్‌హెచ్‌ఏఐ
ఎఫ్‌వోబీలు నిర్మించే గ్రామాలివే..
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
వరంగల్– కరీంనగర్ నగరాలను కలిపే ఎన్‌హెచ్ 563 విషయంలో పాదచారులకు కేంద్రం తీపి కబు రు తీసుకొచ్చింది. వరంగల్– కరీంనగర్ మధ్య దూరాన్ని 2 గంటల నుంచి కేవలం 40 నిమిషాలకు కుదించిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఫోర్‌లేన్‌పై పలుచోట్ల రోడ్డు దాటేందుకు ఇబ్బందిగా ఉందని ఇటీవల భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ విషయమైన ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. వీటిపై నేషనల్ హైవే అ థారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) స్పందించింది. రెండు జిల్లాలను కలుపుతూ దాదాపు 68 కి.మీ. మేర నిర్మించిన జాతీయ రహదారిపై దాదాపు 8 చో ట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ముందుకొచ్చింది. ఆయా ప్రాంతాల్లో పాదచారులు భద్రంగా రోడ్డు దాటేందుకు అవకాశముంది. ది వ్యాంగులు, ముసలి వాళ్లు ఎక్కేందుకు వంతెనలకు మెట్లతోపాటు లిఫ్టులు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలుకు ఉన్నట్లే ఇవి కూడా కాన్‌కోర్స్ తరహా లిఫ్టులు కావడం గమనార్హం.
దాదాపు రూ.18 కోట్ల వ్యయంతో..
భారత్ మాల యోజన కింద దాదాపు రూ.2,486 కోట్లకుపైగా వ్యయంతో చేపట్టిన 68 కి.మీ. పొడవైన ఎన్‌హెచ్– 563పై వాహనాలు గరిష్టంగా 100 కి.మీ. వేగంతో వెళ్లేలా నిర్మించారు. 9 వంతెనలు, 23 చిన్న వంతెనలు, 5 బైపాస్ రోడ్లు, 25 అండర్ పాస్‌లు ఏర్పాటు చేశారు. సెప్టెంబరు తొలివారం నుంచి ట్రయల్‌రన్‌కు అనుమతించారు. అధికారులు– ప్రజలకు సమన్వయ లోపంతో కొన్ని గ్రామాలకు ఈరోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డు దా టేందుకు సరైన మార్గం లేకపోవడంతో వేలాదిమంది ఇబ్బందులు పడుతున్నారు. ట్రయల్ అనంతరం భారీగా ఫిర్యాదులు రావడంతో 8 గ్రామాలను గుర్తించిన ఎన్‌హెచ్‌ఏఐ ఆయా గ్రామాల్లో పాదచారుల కోసం ఫుట్‌ఓవర్ బ్రిడ్జి (ఎఫ్‌వోబీ)లను దాదాపు రూ.18 కోట్ల అంచనావ్యయంతో నిర్మించనుంది. ఇవి కరీంనగర్ జిల్లాలో నాలుగు, హన్మకొండ జిల్లాలో మరో నాలుగు ఉండటం గమనార్హం.
లిఫ్టులతో కూడిన ఎఫ్‌వోబీలు పాదచారులకోసమే: ఎన్‌హెచ్‌ఐఏ
‘రోడ్డు నిర్మాణం అనంతరం ఇటీవల ట్రయల్ రన్ మొదలు పెట్టాం. ఆయా గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పాదచారులకు ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తున్నాయో అధ్యయనం చేశాం. మొత్తం 8 గ్రామాల్లో ఎఫ్‌వోబీలు నిర్మించాలని నిర్ణయించాం. కేంద్రం నుంచి రూ.18 కోట్ల విడుదలకు రంగం సిద్ధమైంది. వీలైనంత త్వరగా ఆయా గ్రామాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడతాం. ప్రతీ వంతెనకు మెట్లతోపాటు లిఫ్టులు ఏర్పాటు చేస్తాం. ఎన్‌హెచ్ 563 విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా మాకు తెలియజేయండి. సమస్యపై అధ్యయనం చేసి వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం’ అని ఎన్‌హెచ్‌ఏఐ అఽధికారులు ‘సాక్షి’కి తెలిపారు.
శంకరపట్నం, శంషాబాద్, గొల్లపల్లి, కొత్తగట్టు, శాంతినగర్, కోతుల నడుమ, సూరారం, బావుపేట


