టెండర్లు.. తంటాలు | - | Sakshi
Sakshi News home page

టెండర్లు.. తంటాలు

Sep 8 2026 12:47 AM | Updated on Sep 8 2026 12:47 AM

నిబంధనలు పట్టించుకోని కాంట్రాక్టర్లు

అర్హత లేని ఏజెన్సీలతో బిడ్లు దాఖలు.. ఖరారులో తీవ్రజాప్యం

రెండుసార్లు ఆహ్వానించినా స్పందన కరువు

మూడోసారి టెండర్లు దాఖలు చేసిన వైనం

ఈఎన్సీ ఆమోదానికి రూ.10.85 కోట్ల పనులు

కోల్‌సిటీ: రామగుండం నగరాభివృద్ధికి నిధులున్నా పనులు సకాలంలో ప్రారంభించడంలో జాప్యమవుతోంది. కొందరు కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించకపోవడం, అర్హత లేనిఏజెన్సీలతో బిడ్లు దాఖలు చేయించడం వంటి కారణాలతో టెండరు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కొన్ని పనులకు విధించిన నిబంధనలు అనుకూలంగా లేక టెండర్లు దాఖలు చేయడానికి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

నిబంధనల ప్రకారం ప్రక్రియ ఇలా..

నగరంలో రూ.2 కోట్లకుపైగా విలువైన పనులకు ప్రజారోగ్య శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) టెండర్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. తొలుత ఆన్‌లైన్‌లో దాఖలైన టెండర్లను రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈఈ తెరిచి.. ఆ తర్వాత పరిశీలించి సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌(ఎస్‌ఈ)కి సిఫారసు చేస్తారు. ఎస్‌ఈ పరిశీలించాక ఈఎన్సీకి నివేదిస్తారు. అర్హతలు పరిశీలించాక ఈఎన్సీ ఆమోదం లభిస్తే ప్రైస్‌ బిడ్లు ఖరారు చేస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియను నిబంధనల మేరకు 15 నుంచి 20 రోజుల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. కానీ, రామగుండం బల్దియాలో అంతకు ఎక్కువ సమయం పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

రెండుసార్లు నో రెస్పాన్స్‌..

కొన్నిపనులకు నిబంధనలు అనుకూలంగా లేకపోవడం మరోసమస్యగా మారింది. దీంతో కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయడానికి ముందుకు రావడంలేదు. ఇటీవల చేపట్టిన కొన్ని పనులకు మొదటి, రెండోసారి కూడా టెండర్లు దాఖలు కాలేదు. దీంతో మూడోసారి టెండర్లు పిలవాల్సి వచ్చింది.

ఈఎన్సీ ఆమోదానికి రూ.10.85 కోట్ల పనులు

రామగుండం నగరంలో వివిధ పథకాల ద్వారా చేపట్టనున్న రూ.10.85 కోట్ల విలువైన పనుల టెండర్లను బల్దియా అధికారులు ప్రజారోగ్యశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఆమోదానికి పంపారు. ఇందులో ప్రధాన పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. అవే ఇవీ..

● ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద రూ.6.85 కోట్లతో హైస్కూల్‌, కళాశాల భవనాల నిర్మాణం

● గోదావరి ఇన్‌టెక్‌ వెల్‌ రోడ్డు వెంట రూ.4 కోట్లతో శ్మశానవాటిక అభివృద్ధి.

డబుల్‌ బెడ్రూమ్‌ పనులకు 17.77 శాతం లెస్‌

మల్కాపురంలోని డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల వద్ద రూ.1.75 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. ఇందులో ఒక కాంట్రాక్టర్‌ 17.77 శాతం తక్కువ రేటుకు (లెస్‌) టెండర్‌ దాఖలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన రెండు పనులకు టెక్నికల్‌ బిడ్లను ఈఎన్సీ ఆమోదానికి పంపించామని అధికారులు వివరిస్తున్నారు.

నెలరోజులకుపైగా సాగుతున్న ప్రక్రియ

సాధారణంగా తక్కువ వ్యవధిలో పూర్తికావాల్సిన టెండర్ల ప్రక్రియ నెల రోజులకుపైగా సాగుతుండడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారులు అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కావడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.

నిధులున్నా.. పనులెప్పుడు?

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ వివిధ పథకాల ద్వారా బల్దియా అభివృద్ధికి నిధులు సమకూర్చుతున్నా.. టెండర్ల ప్రక్రియలోనే జాప్యం కావడంతో పనుల ప్రారంభంలో ఆలస్యమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్‌, ఎమ్మెల్యే, మేయర్‌, కమిషనర్‌ అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నా.. టెండరు దశలో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాంట్రాక్టర్లు నిబంధనలను ముందుగానే పరిశీలించి, అర్హత కలిగిన ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకుని బిడ్లు దాఖలు చేసేలా అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది.

అర్హతలపై అవగాహన లేక?

పనిమొత్తం విలువకు అనుగుణంగా అర్హత ఉన్నఏజెన్సీ ద్వారా టెండర్‌ దాఖలు చేయడం సాధారణ ప్రక్రియ. ఏజెన్సీతో ముందుగానే అగ్రిమెంట్‌ చేసుకుని, అర్హతలు సమకూర్చుకుని టెండర్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. కొందరు కాంట్రాక్టర్లు ముందస్తు ఏర్పాట్లు లేకుండానే టెండర్లు దాఖలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అర్హతల పరిశీలన సమయంలో సమస్యలు తలెత్తడంతో టెక్నికల్‌ బిడ్లపై అభ్యంతరాలు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టెండర్లను ఖరారు చేయడంలో ఇంజినీరింగ్‌ విభాగంపై ఒత్తిడి పెరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement