పెద్దపల్లి: ప్రజావాణిలో అందిన దరఖాస్తుదారుల సమస్యలు విని, పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్రీరాములు తో కలిసి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు చేసుకున్న దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు సిఫారసు చేసి పరిష్కరించాలని సూచించారు.
పంచాయతీ నిధులతో పైప్‌లైన్
పంచాయతీ నిధులతో గ్రామస్తుల తాగునీటి అవసరాలు తీర్చేందు కు ఏర్పాటు చే సిన పైప్‌లైన్‌ను సర్పంచ్ తన పొలం వైపు మళ్లించారు. ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌ను వ్యక్తిగత అవసరాలకు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలి. నిధుల వినియోగంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– రాజేందర్, యువకులు, కొత్తపల్లి
బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలి
దివ్యాంగుల కోసం రిజర్వు చేసిన బ్యాక్‌లాగ్ ఉద్యోగ ఖాళీలను గుర్తించి, భర్తీ చేయా లి. జిల్లాలోని అన్నిశాఖలు, ప్రభుత్వ సంస్థల్లో పెండింగ్‌లో ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఖాళీలను గుర్తించి, శాఖల వారీగా వివరాలను తక్షణమే వెల్లడించాలి.
– విజయ్‌కుమార్, కె.శివకృష్ణ
ప్రభుత్వ భూమిలో సాగు
మా ఊరులోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోంది. సర్వే నంబర్ 805/3లోని 4 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమికి గతంలో అధికారులు హద్దులు నిర్ణయించి కంచె, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించి ట్రాక్టర్‌తో దున్ని ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు.
– దాసరి రమేశ్, పందిల్ల
నా వాటా ఏది?
మా నాన్న నుంచి వారసత్వంగా వచ్చిన ఆరు గుంటల్లో నా వాటా నాకు ఇవ్వకుండా మా తమ్ముడు తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ప్రస్తుతం అందులో ఇల్లు కట్టుకుంటన్నాడు. దీనిపై ప్రశ్నిస్తే నాపై దాడి చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నా వాటా నాకు ఇప్పించాలి.
– ఐలయ్య, భోజన్నపేట


