గోదావరిఖని/జ్యోతినగర్/రామగుండం: బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో సోమవారం ఆందోళనలు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ, ‘రాష్ట్రంలో దొరికినంత దోచుకో.. దోచుకున్నది దాచుకో’ స్కీం నడుస్తోందన్నారు. కోరుకంటి చందర్ మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదన్నారు. నాయకులు కౌశిక హరి, మూల విజయారెడ్డి, హరీశ్‌రెడ్డి, మేకల సమ్మన్నయాదవ్ పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
పెద్దపల్లి: అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో రాజీవ్ రహదారిపై ఆందోళన చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆందోళనలతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, ఉప్పు రాజ్‌కుమార్, పెంచాల శ్రీధర్, పడాల సతీశ్‌గౌడ్, కొయ్యడ సతీశ్, లక్ష్మణ్, సదయ్య, ముత్యాల రాజయ్య, పూదరి చంద్రశేఖర్, రేవల్లి స్వామి, కాశిపాక వాసు, పల్లె మధు, నిఖిల్, ధర్మపురి, వీరేశం, పిట్టల మహేశ్, శ్రీనివాస్ ఉన్నారు.


