పెద్దపల్లిరూరల్: భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ నిధులను బోగస్ లబ్ధిదారులకు అందించేందుకు రంగాపూర్ అడ్డాగా మారింది. ఓ కుటుంబంలోని నలుగురి పేరిట బోగస్ బిల్లులు రూపొందించి కార్మిక సంక్షేమ శాఖకు సమర్పించి నిధులు స్వాహా చేయడం, దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపినా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
● నిధుల మంజూరులో అనుమానాలు
కార్మికులు ప్రమాదాల బారిన పడ్డా, మరణించినా పరిహారం కోసం ఆయా జిల్లాల నుంచే కార్మిక సంక్షేమ బోర్డుకు దరఖాస్తు చేయాలి. కానీ, జిల్లాకు చెందిన కార్మికుల దరఖాస్తులు పొరుగున ఉన్న మంచిర్యాల కార్మిక శాఖ నుంచి రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డుకు వెళ్లడం, అక్కడి అధికారులు ఆగమేఘాలపై నిధులు విడుదల చేయడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
● మచ్చుకు కొన్ని..
పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కుమారస్వామి డెత్ క్లెయిమ్.. శ్రీనివాస్ అండ్ అదర్స్ పేరిట మంజూరైనట్లు సమాచారం. ఇదేరీతిన పెద్దపల్లికి చెందిన గుండేటి బాలయ్య మరణించగా మంచిర్యాల ఠాణాలో 2017 జూన్ 7న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 2026 ఫిబ్రవరిలో డెత్ క్లెయిమ్ కావడం గమనార్హం. ఇందుకు రూ.6.30లక్షలు అజయ్ అండ్ అదర్స్ పేరిట మంజూరయ్యాయి. ఈ ప్రమాదాలు వాస్తవంగా జరిగాయా? నకిలీ ఎఫ్‌ఐఆర్‌లతో బోగస్ బిల్లులు సృష్టించారా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. అలాగే కమాన్‌పూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఒకరి పేరిట లేబర్‌కార్డు జారీ అయిన ఐదురోజులకే డెత్ క్లెయిమ్ కావడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
● ఆ ఇద్దరు ఒక్కటైతేనే..
బిల్లుల మంజూరుకు సహాయ కార్మికశాఖాధికారితోపాటు నోడల్ అధికారి అంగీకారం ఉండాలి. అలాగైతేనే కార్మిక సంక్షేమ బోర్డు నిధులు మంజూరు చేస్తుంది. మంచిర్యాలలో ఇన్‌చార్జి అధికారులుగా వ్యవహరించిన కరీంనగర్ కార్యాలయ అధికారుల్లో ఓ ఇద్దరు ఒక్కటై ఈ తతంగం నడిపించారు. పలు ప్రాంతాల నుంచి దరఖాస్తులు తెప్పించేందుకు బీమా కంపెనీ ఉమ్మడి జిల్లా ప్రతినిధి ప్రధానపాత్ర పోషించినట్లు చర్చ సాగుతోంది.
● మంచిర్యాలకు కొత్త నోడల్ అధికారి రాకతో..
మంచిర్యాల ఇన్‌చార్జి అధికారి స్థానంలో గ్రూప్ –1 అధికారి రాకతో ఆ అధికారి తనసొంత కార్యాల యం కరీంనగర్ చేరుకున్నారు. కంగుతిన్న సదరు కార్మికశాఖ సహాయాధికారి.. ఎలాగైనా సదరు అ ధికారితో కలిసి పనిచేయాలన్న ఆలోచనకు వచ్చి.. పెద్దపల్లి కార్మికశాఖాధికారి విధుల్లో నిర్లక్ష్యం చూపుతున్నారనే కారణంతో ఉన్నతాధికారులతో సస్పెండ్ చేయించారని తెలుస్తోంది. దీంతో కరీంనగర్ నోడల్ అధికారి పరిధిలోనే ఉన్న పెద్దపల్లిలో వెంటనే ఇక్కడ అదనపు బాధ్యతలు స్వీకరించినట్టు సమాచారం. వీరిద్దరితోపాటు బీమా కంపెనీ ఉమ్మడి జిల్లా ప్రతినిధి.. కార్మిక సంక్షేమ బోర్డులో కొందరు బృందంగా ఏర్పడి ఈ తతంగం నడిపించినట్టు సమాచారం.
సీబీఐతో విచారణ జరపాలి
భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ కోసం అమలు చేసే బీమా పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. ఈ వ్యవహారంపై సీబీఐ అధికారులు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
– ఉప్పు రాజ్‌కుమార్, బీఆర్‌ఎస్ నేత
కఠినంగా వ్యవహరించాలి
అసలైన కార్మికులకు అన్యాయం జరుగుతోంది. లేబర్‌కార్డులను అనర్హులకు అందించడం మొదలు.. పరిహారం చెల్లింపుల వరకు అన్నీఅక్రమాలే. ఇందులో భాగస్వాములైన వారందరిపైనా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.
– ఎరవెల్లి ముత్యంరావు, సీఐటీయూ నేత
పాత పద్ధతి మేలు
భవన నిర్మాణ రంగ కార్మికుల ప్రాణాలకు భద్రత కరువైంది. వారి సంక్షేమానికి ఉద్దేశించిన పథకం అమలు బాధ్యత ప్రభుత్వాధికారులకు కాకుండా ప్రైవేట్ బీమా సంస్థకు అప్పగించడంతోనే బోగస్ క్లెయిమ్‌లు మంజూరవుతున్నాయి.
– చిలువేరు స్వామి, కార్మిక సంఘం నేత
బోగస్ క్లెయిమ్‌ల
‘మంచి’ర్యాల
రంగాపూర్‌లోని ఓ బీమా ఏజెంట్‌కు మంచిర్యాల కార్మిక శాఖాధికారులు.. హైదరాబాద్‌లోని కార్మిక సంక్షేమబోర్డు అధికారుల మధ్య ఉన్న లాలూచీతో గంటల్లోనే క్లెయిమ్‌లు అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌తోపాటు పెద్దపల్లి, ములుగు, జగిత్యాల, జనగాం, మహబూబ్‌నగర్, గజ్వేల్, మహబూబాబాద్ తదితర జిల్లాల కార్మికుల బోగస్ బిల్లులను సైతం మంచిర్యాల నుంచే మంజూరు చేయించుకున్నట్లు తెలుస్తోంది.


