జ్యోతినగర్: ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై వరుసగా ఏర్పాటు చేసిన యూటర్న్‌లు వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలో ఆరు యూటర్న్‌లు ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యూటర్న్ వద్ద రహదారిని దాటుతున్న టెంపో వ్యాన్‌ను డీసీఎం ఢీకొట్టిన ఘటన కూడా ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తినష్టం మాత్రమే జరిగింది. ఎన్టీపీసీ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై తహసీల్దార్ కార్యాలయం తర్వాత క్రషర్‌నగర్, ప్రాజెక్టు లేబర్‌గేట్, మేడిపల్లి సెంటర్, టీటీఎస్ గేట్, ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు, రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎదుట ఉన్న యూటర్న్‌లు ప్రమాదకరంగా మారాయి.
సర్వీస్ రోడ్డు లేక ఇబ్బందులు
ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్, ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో రాకపోకలు అధికంగా ఉన్నప్పటికీ రాజీవ్ రహదారిని ఆనుకుని తగిన సర్వీస్ రోడ్డు లేక వాహనదారులు ప్రధాన రహదారిపైనే ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో చిన్నదూరం వెళ్లడానికి కూడా యూటర్న్‌లను వినియోగించాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ కదలికలు పెరిగి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
యూటర్న్‌పై సేఫ్టీ ఆడిట్ అవసరం
మూడు కిలోమీటర్ల పరిధిలోని ఆరు యూటర్న్‌లను అధికారులు సమగ్రంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రతీయూటర్న్ వద్ద వాహనాల రాకపోకలు, ప్రమాదాల చరిత్ర, విజిబిలిటీ, యూటర్న్‌ల మధ్య దూరం, రహదారి వెడల్పు తదితర అంశాలను పరిశీలించి అవసరం లేనియూటర్న్‌లను పునఃపరిశీలించాలని ప్రజలు, ప్రధానంగా వాహనదారులు కోరుతున్నారు.
టర్నింగ్ లేన్‌లు.. హెచ్చరిక బోర్డులు
యూటర్న్‌ల వద్ద వాహనాలు వేచి ఉండేందుకు ప్రత్యేక టర్నింగ్/షెల్టర్ లేన్, స్పష్టమైన రోడ్డు మార్కింగ్‌లు, రిఫ్లెక్టివ్ రోడ్డు స్టడ్స్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. మార్గదర్శకాల ప్రకారం మీడియన్ ఓపెనింగ్‌ల వద్ద–టర్న్ వాహనాల కోసం అదనపు 3.5 మీటర్ల వెడల్పు షెల్టర్ లేన్ ఏర్పాటు చేయాలి.
వెలుతురు, విజిబిలిటీ మెరుగుపరచాలి
యూటర్న్ ప్రాంతాల్లో రాత్రివేళ స్పష్టంగా కనిపించేలా లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు డివైడర్‌పై వాహనదారుల దృష్టికి అడ్డుగా ఉండే పొదలు, అనవసర బోర్డులను తొలగించాలి. మీడియన్ ఓపెనింగ్ సమీపంలో స్పష్టమైన విజిబిలిటీ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రహదారి భద్రతా మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.
తరచూ చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు
రాజీవ్ రహదారి వెంట సర్వీస్ రోడ్డు లేక వాహనదారులకు ఇబ్బందులు
యూటర్న్‌లను శాసీ్త్రయంగా పునఃపరిశీలించాలని డిమాండ్


