● తరచూ ప్లాంట్ షట్‌డౌన్ ● తాజాగా స్టీమ్‌పైప్‌లైన్ లీక్ ● నిలిచిన యూరియా ఉత్పత్తి
ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్
ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో యూరియా ఉత్పత్తికి విఘాతం కలుగుతోంది. గత శనివారం కూడా ఫస్ట్‌షిఫ్ట్‌లో మెయిన్‌స్టీమ్ పైప్‌లైన్(ఆవిరి పైప్‌లైన్) ఒక్కసారిగా లీకై యూరియా ఉత్పత్తి స్తంభించింది. అధికారులు అప్రమత్తమై ప్లాంట్‌ను తాత్కాలికంగా షట్‌డౌన్ చేశారు. లీకేజీ తీవ్రత అధికంగా ఉండడంతో వెంటనే రక్షణ చర్యలు చేపట్టారు. రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అయ్యే కర్మాగారంలో ఉత్పత్తి యథాస్థితికి రావడానికి 15 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇది రెండోసారి
గత జూలై 8న స్టీమ్ పైప్‌లైన్ లీక్ కావడంతో ప్లాంట్ షట్‌డౌన్ చేశారు. మరమ్మతు చేయడానికి సుమారు 8 రోజుల సమయం పట్టింది.
తప్పని మరమ్మతు తిప్పలు
కర్మాగారం ప్రారంభం నుంచి ఏటా సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. 2025–26లో 117 రోజులపాటు, 2025 మేలో వార్షి క మరమ్మతు నేపథ్యంలో 39 రోజులపాటు ప్లాంట్ షట్‌డౌన్ చేశారు. అనంతరం హాల్డర్ టాప్సో ఎక్స్ఛేంజ్ రిఫార్మర్ (హెచ్‌టీఆర్) లీకేజ్ కావడంతో మరో 78 రోజులపాటు ప్లాంట్‌ను మూసివేశారు. ఆ తర్వాత హెచ్‌టీఆర్ లేకుండానే యూరియా ఉత్పత్తి ప్రారంభించారు. దీనిప్రభావంతో యూరియా ఉ త్పత్తి భారీగా తగ్గింది. సాంకేతిక సమస్యలు ఇలానే కొనసాగితే ప్లాంట్ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరమ్మతుకు 15 రోజుల సమయం
పైప్‌లైన్ లీకేజీని పునరుద్ధరించేందుకు ఇంజినీరింగ్ నిపుణులు రంగంలోకి దిగారు. భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తూ మరమ్మతులను త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
రైతుల ఆందోళన
గతేడాది యూరియా ఉత్పత్తి నిలిచి రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడింది. ప్రస్తుతం వర్షాలు ఆలస్యంగా కురవడంతో రైతులు పంటలు వేశారు. స్టీమ్ పైప్‌లైన్ లీకేజీతో ప్లాంట్ షట్‌డౌన్ కావడంతో సకాలంలో యూరియా అందుతుందో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.


