ఫెర్టిలైజర్‌సిటీ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. గురువారం రామగుండం కార్పొరేషన్ 21వ డివిజన్ వీర్లపల్లిలో వర్షాలతో ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రహరీ కూలి పలు ఇళ్లలోకి చేరిన వరద నీటిని పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాలు సందర్శించి బాధిత కుటుంబాలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తూ బాధితులకు అవసరమైన సహాయ చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


