పెద్దపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం రాత్రి కలెక్టరేట్‌లో జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది విధి సమయాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతీ రోగితో మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని, ముఖ్యంగా గర్భిణులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య సేవలను నిరాకరించవద్దని ఆదేశించారు. ఆసుపత్రుల్లో అసెప్టిక్ ప్రమాణాలను పాటించాలని, శస్త్రచికిత్సల అనంతరం గాయాల ఇన్‌ఫెక్షన్లను గైనకాలజిస్టులు ప్రత్యేకంగా పర్యవేక్షించి తగిన చికిత్స అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జిల్లా వైద్యాధికారి పవిత్ర, శ్రీధర్, గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు, వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


