సింగరేణిలో సమ్మె మేఘాలు
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో సమ్మె మేఘాలు అలముకున్నాయి. దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొనాలని జాతీయ కార్మిక, విప్లవ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. గురువారం జరిగే టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు. సమ్మెతో బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లుతుందని మరోవైపు యాజమాన్యం చెబుతోంది.
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని..
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాల జేఏసీ ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చింది. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, సింగరేణి మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని, సొంతింటి పథకం అమలు చేయాలని, పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ మాఫీ చేయాలని, డిస్మిస్ కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలి, మారుపేర్ల కార్మికుల సమస్య పరిష్కరించాలని సింగరేణి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సమ్మెకు దూరంగా ఉండాలి : సింగరేణి..
ఒకరోజు సమ్మెతో 2.20లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగి రూ.77కోట్ల నష్టం వాటిల్లుతుందని, కార్మికులు వేతనాల రూపంలో రూ.12కోట్లు నష్టపోతారని సింగరేణి యాజమాన్యం చెబుతోంది. సింగరేణికి సంబంధించిన డిమాండ్‌లు ఏమీలేవని, సమ్మెతో సాధించేదేమీ లేదని, కార్మికులు దూరంగా ఉండాలని పేర్కొంటోంది. మరోవైపు.. సమ్మెకు దూరంగా ఉండాలని బీజేపీ అనుబంధ బీఎంఎస్ కోరుతోంది.
సమ్మెతో వాటిల్లే నష్టం
సింగరేణిలోని ఉద్యోగులు 40,000
బొగ్గు ఉత్పత్తి విలువ(రూ.కోట్లలో) 77
కార్మికుల వేతనం(రూ.కోట్లలో) 12
బొగ్గు ఉత్పత్తి(లక్షల టన్నుల్లో) 2.20
విజయవంతానికి కార్మిక సంఘాల పిలుపు
సింగరేణి ఉద్యోగులు దూరంగా ఉండాలి
రామగుండం –1 ఏరియా జీఎం లలిత్‌కుమార్


