అటు పుష్కరాలు.. ఇటు పనులు
మంథని: పన్నెండేళ్లకోసా నిర్వహించే సరస్వతీ పుష్కరాలు గురువారం ప్రారంభం కానున్నాయి. మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణాహిత నదులు కలుస్తుండంతో ఇక్కడ అంతర్‌వాహిణిగా ప్రవహించే సరస్వతీ నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. 12రోజుల పాటు జరిగే పుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరివస్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారికి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది కానీ.. అఽధికారుల ముందుచూపు లేమి, కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో భక్తులకు అవస్థలు తప్పేలాలేవు.
ఇప్పుడే వంతెన మరమ్మతులు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా(ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లోని మంథని మండలం) అడవిసోమన్‌పల్లి వంతెన అప్పటిసీఎం పీవీ నరసంహారావు హయాంలో నిర్మించారు. దాని సామర్థ్యాన్ని మించి వాహనాలు రాకపోకలు సాగించడం, పురాత వంతెన కావడంతో శిథిలావస్థకు చేరింది. దాని మరమ్మతులకు ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. సుమారు నెలరోజులుగా మరమ్మతులు కొనసా..గుతున్నాయి. దానిపై పగుళ్లు చూపాయి. పెద్దగుంతలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతంతోపాటు పాత నిర్మాణాన్ని తొలగించి సిమెంట్, కాంక్రీట్‌తో పనులు చేస్తున్నారు. ఒకవైపు వాహనాలకు అనుమతి ఇచ్చి మరోవైపు పనులు చేస్తున్నారు. పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వంతెన మీదుగా వాహనాలు నడుస్తున్నాయి. అంతేగాకుండా బొగ్గు లారీలు, ఇతర భారీ వాహనాలు సైతం పెద్దఎత్తున రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు తీవ్రఅంతరాయం ఏర్పడుతోంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇరువైపులా ఉన్న మానేరుతో ప్రమాదం ఏర్పడుతుంది.
వాహనాలకు అంతరాయం
ఒకేవైపు వాహనాల రాకపోకలతో భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. సాధారణ రోజుల్లో ఈపరిస్థితి ఉంటే.. పుష్కరాల సందర్భంగా 12 రోజులపాటు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్రమైన అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది.
రోడ్డు విస్తరణ.. అభివృద్ధి
మల్హర్ మండలం కొయ్యూర్ నుంచి కాటారం మండలం దన్వాడ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. సరస్వతీ పుష్కరాల తేదీలు ఏడాది ముందుగానే ప్రకటించారు. మంథని– కాటారం మధ్య విస్తరణ, అభివృద్ధి, సరిహద్దు వంతెన మరమ్మతులు ఆలస్యంగా ప్రారంభించడమే కాకుండా నత్తనడకన సాగుతుండడంతో పుష్కరాల వేళ భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
సరస్వతీ పుష్కరాల వేళ.. అధికారుల ముందుచూపు లేమి
మంథని–కాటారం మధ్య సాగుతున్న అభివృద్ధి పనులు
రెండు జిల్లాల సరిహద్దు వంతెనకు మరమ్మతులు
ట్రాఫిక్‌కు అంతరాయం.. అసౌకర్యానికి గురవుతున్న వాహనదారులు
అసౌకర్యం కలగకుండా చర్యలు
మంథని మండలం అడవిసోమన్‌పల్లి వంతెనపై చేపట్టిన మరమ్మతు పనులతో వాహనదారులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటాం. పనులను పర్యవేక్షిస్తూ వర్క్ ఇన్‌స్పెక్టర్లు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. వాహనదారులు సహకరించాలి.
–జఫార్, డీఈఈ, ఆర్ అండ్ బీ, మంథని
అటు పుష్కరాలు.. ఇటు పనులు
అటు పుష్కరాలు.. ఇటు పనులు


