ఆ ఒక్కటి అడగొద్దు..!
మంథని: అవుట్ సోర్సింగ్.. పార్ట్ టైం ఉద్యోగం పేరిట వివిధ శాఖల్లో వేలాది మంది బోగస్ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ప్రభుత్వం వారిని తొలగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆర్ఖిక శాఖ విధుల నుంచి తొలగించింది. కానీ, వారంతా ఇప్పటికీ అనధికారికంగా విధుల్లోనే కొనసాగుతున్నట్లు సమాచారం.
విధుల్లోనే కంప్యూటర్ ఆపరేటర్లు..
రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసే సుమారు 300 మంది ఉద్యోగుల్లో 190 మందిని అక్టోబర్ 10న తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 300 మందిలో 190 మంది కంప్యూటర్ ఆపరేటర్లు కాగా మిగతా వారు అటెండర్లు, షరాప్‌లు ఉన్నారు. అటెండర్లు, షరాప్‌లను కొనసాగిస్తూ 190 సిస్టం ఆపరేటర్లను విధుల్లోంచి తొలగించారు. ఈశాఖలో పనిచేసే షరాప్, అటెండర్లు నెలకు రూ.16,500 వేతనంపైనే నెట్టుకు వస్తున్నారు. వీరికి చాలీచాలని వేతనాలు వస్తున్నాయని ఆందోళన ఉన్నారు. తక్కువ వేతనాలు ఉండడంతో అందరినీ కొనసాగించాలని ఉద్యోగులు విన్నవించారు. ఈమేరకు ఏటా వారి విధులను పొడిగిస్తున్నారు. కానీ, సిస్టం ఆపరేటర్ల విషయంలో ప్రభుత్వం కనికరం చూపలేదు. మరోవైపు.. ప్రభుత్వం వారిని విధుల్లోంచి తొలగించినా ఆయా కార్యాలయాల్లో అనధికారికంగా కొనసాగుతున్నట్లు సమాచారం,.
వేతనాల చెల్లింపుపై అనుమానాలు
ఆర్థికభారం తగ్గించుకునేందుకు రిజస్ట్రేషన్ల శాఖలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న సిస్టం ఆపరేటర్లను తొలగించి అదే శాఖలో రెగ్యులర్ ఉద్యోగులను ఆ విధులను చూసుకోవాలని ప్రభు త్వం సూచించింది. కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చాలాచోట్ల సిస్టం ఆపరేటర్లు యథావిధిగా పనులు చేస్తూనే ఉన్నారని సమాచారం. వీరికి అవుట్ సోర్సింగ్ పద్ధతిన ప్రతినెలా రూ.19.500 చొప్పున చెల్లించేవారు. ప్రభుత్వం వారిని తొలగించడంతో వీరికి వేతనాలు ఎవరు చెల్లిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై జిల్లాలోని ఓ అధికారిని వివరణ అడిగేందుకు యత్నించగా ‘ఆ ఒక్కటి అడక్కు’ అని సమాధానమిచ్చారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో
ప్రైవేటు పర్సన్ హవా?
రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రైవేటు వ్యక్తులదే పెత్తనం ఉంది. కీలకమైన విభాగాలు వారే చూస్తూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నడిపిస్తున్నారు. చాలాకార్యాలయాల్లో రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ల కొరత ఉండడం, దీనికితోడు ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం అధికంగా కొనసాగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. దస్తావేజు లేఖరులు సైతం తమ పరిధిని మించిన పనులు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
తొలగించినా.. విధుల్లోనే కొనసాగింపు
సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు
ప్రతీనెల వేతనాల చెల్లింపుపై అనేక అనుమానాలు
ఆ ఒక్కటి అడగొద్దు..!


