గోదావరిఖని(రామగుండం): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ మేరకు మార్చి 10వ తేదీలోగా క్యాథ్‌ల్యాబ్ అందుబాటులోకి రావాలి. కానీ, ఇప్ప టివరకు గదులు మాత్రమే సిద్ధమయ్యాయి. అతిముఖ్యమైన వైద్య పరికరాలు రాలేదు. కాంట్రాక్టర్ విన్నపం మేరకు నెలపాటు సింగరేణి గడువు పొడిగించింది. ఈలెక్కన చూసినా ఈనెల 10వ తేదీ వరకు క్యాథ్‌లాబ్ సేవలు అందుబాటులోకి రావాలి. అయి నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం పురోగతిలో లేదు.
అయితే 65 కి.మీ.. లేదంటే 250 కి.మీ..
గుండె సంబంధిత సమస్యలతో బాధపడే సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు చికిత్స కోసం సుమారు 65 కి.మీ. దూరంలోని కరీంనగర్ లేదా దాదాపు 250 కి.మీ. దూరంలోని హైదరాబాద్‌లోని ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సకాలంలో చేరితే ప్రాణాలు దక్కుతాయి. లేదంటే మార్గమధ్య ంలోనే తుదిశ్వాస విడిచిన సందర్భాలూ ఉన్నాయి.
ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా..
గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు కాపాడే లక్ష్యంతో గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం సింగరేణి రూ.13కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.7కోట్లతో క్యాత్‌ల్యాబ్ యంత్రం, మిగతా నిధులతో ఫర్నిచర్ కొనుగోలు, అదనపు గదులు నిర్మించాల్సి ఉంది.
కార్పొరేట్ ఆస్పత్రులకు రూ.వేల కోట్లు..
కార్మికులు, ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యం అందేందుకు హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులకు సింగరేణి ఏటా రూ.వేల కోట్లు వెచ్చిస్తోంది. ఈ భారం తగ్గించడం, గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు కాపాడడమే క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు రూ.26లక్షలతో బయోకెమిస్ట్రీ అనాలిసిస్, రూ.27లక్షలతో మైక్రో బయోలజీ యంత్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.2 కోట్లతో 50 పడకల మాతాశిశు సంక్షేమ భవనం నిర్మిస్తోంది.
ఈసీజీ సేవలకే పరిమితం
గుండెపోటుకు గురైన కార్మికులు, వారి కుటుంబసభ్యులను తొలుత సమీప డిస్పెన్సరీ తీసుకెళ్తున్నారు. తర్వాత ఏరియా ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. ఇక్కడ ఈసీజీ తదితర పరీక్షలు చేశాక కార్పొరేట్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఈప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం 3 గంటల సమయం పడుతోంది. ఈలోగా మరోసారి గుండెపోటు వస్తే ప్రాణాలు పోవడం తప్ప గత్యంతరం లేదు. గుండెపోటుకు గురైన గంటలోపే చికిత్స అందితే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీనికోసమే క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు.
ముందుకు సాగని పనులు
నెల రోజులపాటు గడువు పొడిగించినా అందుబాటులోకి రావడం అనుమానమే..
కార్మికులకు తప్పని తిప్పలు
గుండె సంబంధిత సమస్యలతో బాధపడే కార్మికులకు వైద్యసేవలు అందించేందుకు త్వరలోనే సింగరేణి ఆస్పత్రిలో క్యాథ్‌ల్యాబ్ ప్రారంభమవుతుంది. గుండెపోటు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
– రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం
మూడు నెలల్లో కార్డియాలజీ ఏర్పాటు చేస్తాం. పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గుండెపోటుకు గురైన కార్మికుడికి గంటలోగా చికిత్స అందిస్తాం.
– అసెంబ్లీలో డిప్యూటీ సీఎం
భట్టి విక్రమార్క


