కళాకారులకు అందని పింఛన్లు
● స్వరాష్ట్రంలోనూ అన్యాయమేనని ఆవేదన ● పట్నాలు, బోనాల సందర్భాల్లోనే కొంత ఉపాధి
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పథకాల అమలు, ప్రజారోగ్యం కోసం పాటించాల్సిన పద్ధతులపై ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఆట, పాటలతో ప్రదర్శనలిచ్చే తమను సర్కారు పట్టించుకోవడం లేదని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిస్తే తమకు మేలు కలుగుతుందని ఆశించి స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో పాలుపంచుకున్నా తమ కుటుంబాలను పోషించుకోవడమే భారంగా మారిందని వాపోతున్నారు.
పట్నాలు.. బోనాలప్పుడే పని..
పల్లెల్లో ఏటా బోనాలు, పట్నాలతో దేవతలకు మొక్కులు సమర్పించుకునే సమయంలోనే తమకు కొంతపని లభిస్తోందని ఒగ్గు కళాకారులు పేర్కొంటున్నారు. గతంలో ఎవరైనా చనిపోయినప్పుడు కూడా తమతో కథలు చెప్పించేవారని, ఇపుడు ఆ పరిస్థితులు కూడా చాలావరకు తగ్గిపోయాయని పేర్కొంటున్నారు. పనిలేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని, అందుకే వ్యవసాయ కూలీ పనులు చేసేందుకు వెళ్లాల్సి వస్తోందని పలువురు కళాకారులు ఆవేదనతో చెబుతున్నారు.
పింఛన్ కోసం నిరీక్షణ..
ప్రభుత్వం కనీసం తమకు పింఛన్లు కూడా అందించడం లేదని కళాకారులు వాపోతున్నారు. ప్రభు త్వం అందిస్తున్న ఆసరా పథకం ద్వారా అర్హత ఉన్న కళాకారులకు పింఛన్లు మంజూరు కావడం లేదంటున్నారు. ఇప్పటికై నా పింఛన్లు అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కళాకారులకు ప్రోత్సాహాన్ని అందించి మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందేలా చూడాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.


