ముగిసిన తొలివిడత నామినేషన్ల పర్వం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన తొలివిడత నామినేషన్ల పర్వం

Nov 18 2026 1:02 AM | Updated on Nov 18 2026 1:02 AM

పార్వతీపురం రూరల్‌: జిల్లాలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముగిసిందని ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది, ఇతర శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వహించడం వల్ల నామినేషన్‌ కేంద్రాల వద్ద శాంతి భద్రతలను విఘాతం కలగలేదని పేర్కొన్నారు. రెండు, మూడో విడత నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. ప్రక్రియ ముగిసే వరకు భద్రతా లోపాలకు తావివ్వకుండా ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వర్తించాలని సూచించారు. గత ఎన్నికల్లో ఘర్షణలు, వివాదాలు జరిగిన ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా నిర్భయంగా తమ హక్కులను వినియోగించుకునేలా పటిష్ట భద్రత, భరసా కల్పిస్తామని ఎస్పీ స్పష్టంచేశారు.

వదలవు..కదలవు..!

కొమరాడ: మండల ప్రజలను గజరాజుల బాధలు వీడడం లేదు గడిచిన నెలరోజులుగా కొమరాడ మండలంలో తిష్ఠ వేసిన గజరాజుల గుంపు మంగళవారం కుమ్మరిగుంట, సుందరారపురం, అంకుళ్లవలస గ్రామల్లో సంచరించాయి. ఈ క్రమంలో ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే ప్రకృతి వైపరీత్యాలు ఒక వైపు గజరాజుల సంచారం మరోవైపు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏనుగుల గుంపు ఎప్పుడు ఎటు వైపు నుంచి వచ్చి పంటలపై పడి ధ్వంసం చేస్తాయోననే భయం అన్నదాతను వెంటాడుతోంది. రెక్కల కష్టంతో సాగుచేసిన పంట చేతికొచ్చే తరుణంలో పంట నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అందని పంట నష్టపరిహారం

గజరాజులు పంటలు ధ్వంసం చేస్తే కార్యాలయాల చుట్టూ తిరిగి నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ నెలలు గడుస్తున్నా పరిహారం అందడం లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు వచ్చి పరిశీలించి వివరాలు నమోదు చేస్తున్నప్పటీకీ పరిహారం మాత్రం రైతుల చేతికి చేరడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటనష్టంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన తమకు పరిహారం అందకపోవడంతో అప్పుల భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొండను ఢీకొని కంటైనర్‌ డ్రైవర్‌ మృతి

పాచిపెంట: మండలంలోని పి.కోనవలస చెక్‌పోస్టు ఒకటో మైలురాయి ఘాట్‌రోడ్డులో ఓ కంటైనర్‌ కొండను ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్‌ మృతిచెందినట్లు ఎస్సై అర్జున్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కంటైనర్‌ విశాఖపట్నం వస్తుండగా అదుపుతప్పి పి.కోనవలస ఘాట్‌రోడ్డులో కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్‌ను రాజస్థాన్‌కు చెందిన మనీష్‌కుమార్‌(45)గా గుర్తించారు. కంటైనర్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ మృతదేహాన్ని బయటకి తీసేందుకు సహాయకచర్యలు చేపడుతున్న క్రమంలో, నవరంగ్‌పూర్‌ నుంచి విశాఖపట్నం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వస్తున్న మరోలారీ బ్రేకులు ఫెయిలై ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సు వెనుక సీట్లో కూర్చున్న పాచిపెంట, శ్రీకాకుళం వాసులకు స్వల్పగాయాలయ్యాయి. వారిని 108లో సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.ఈ రెండు ఘటనలపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement