సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. మొదట చెప్పినట్లుగా రెండు విడతల్లో కాకుండా.. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడత నామినేషన్ల ఘట్టం మంగళవారంతో ముగిసింది. మొత్తంగా మొదటి దశలో ఎన్నికలు జరగనున్న గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం, గరుగుబిల్లి, కొమరాడ, బలిజిపేట, పార్వతీపురం, సీతానగరం మండలాల్లోని పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ స్థానాలకు 1,182(మూడో రోజు 427).. వార్డు సభ్యులకు 4,011(మూడో రోజు 2,210) నామినేషన్లు వచ్చాయి. పరిశీలన, ఉప సంహరణ, ఇతర ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించనున్నారు.
రెండు కాదు.. మూడు దశల్లో
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మార్పులు సంభవించాయి. తొలుత రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని భావించినా.. తాజాగా మూడు విడతల్లో చేపట్టాలని నిర్ణయించారు. పాలకొండ, సాలూరుల్లో ఒకేసారి పోలీసు బందోబస్తు ఇవ్వడంలో ఇబ్బందులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మూడో విడతలో సాలూరు నియోజక వర్గంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలోని పాలకొండ, వీరఘట్టం, భామిని, సీతంపేట మండలాల్లో రెండో విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు మండలాల్లోని 146 గ్రామ పంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు చేపట్టనున్నారు. ఇందుకోసం 1,290 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 1,72,951 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా 40 క్లస్టర్లు, నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం నుంచి ఇక్కడ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. 29వ తేదీన పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సామగ్రి పంపిణీ, బ్యాలెట్ పెట్టెల భద్రత, ఇతర ఏర్పాట్లపై అధికారులు తలమునకలయ్యారు.
ఎనిమిది మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 1,182..
వార్డు సభ్యులకు 4,011 నామినేషన్లు
నేటి నుంచి రెండో విడత పాలకొండ నియోజక వర్గంలో నామినేషన్ల స్వీకరణ
మూడో దశలో సాలూరు నియోజక వర్గంలో ఎన్నికలు


