వార్డుల అభివృద్ధే లక్ష్యంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పార్వతీపురం పట్టణంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. శనివారం పట్టణంలోని 21, 22 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా సాగింది. మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి పట్నాన సాయిశ్రీ,, 21వ వార్డు అభ్యర్థి సంఘంరెడ్డి సందీప్ కుమార్, 22వ వార్డు అభ్యర్థి మరిశర్ల భవానిలతో కలిసి నాయకులు గడపగడపకూ వెళ్లి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో వార్డు సభ్యులు, చైర్పర్సన్ స్థానాలకు ఫ్యాను గుర్తుపైనే రెండు ఓట్లు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. టిట్కో మాజీ చైర్మన్ జమ్మన్న ప్రశాంత్‌కుమార్, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
– పార్వతీపురం రూరల్
పాలకొండ: నగర పంచాయతీ వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి పాలవలస ఇందుమతి ప్రచారం జోరు పెంచారు. శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో ఆమె పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి హమీ అందించారు. పట్టణంలో ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు పట్టణ ప్రజలు హారతులు పట్టి మద్దతు పలికారు. ఆమెతో పాటు మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పాలవలస గౌరీ పార్వతి, పార్టీ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి రిబ్కారాణి ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. శనివారం మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఆధ్వర్యంలో చైర్పర్సన్ అభ్యర్థితో పాటు 23, 29, 30 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులతో కలసి ఆయా వార్డుల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటర్లకు వైఎస్ జగన్మోహన రెడ్డి అందించిన సంక్షేమ పాలన గురించి వివరించారు. ఆయా వార్డుల్లో ప్రజలు పూలమాలలతో స్వాగతం పలికారు. – సాలూరు రూరల్


