● పోలింగ్ కేంద్రాల వద్ద పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. బరిలో ఉన్నవారు సైతం పసుపు చొక్కాలు వేసుకొని హల్‌చల్ చేశారు. సాక్షాత్తు పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పసుపు రంగు టోపీ ధరించి పోలింగ్ కేంద్రాల వద్ద తిరిగారు. చర్చ్ వీధి పోలింగ్ కేంద్రం వద్ద బరిలో ఉన్న ఓ అభ్యర్థి పసుపు చొక్కా వేసుకొని అటూఇటూ తిరగడంపై అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు సుతిమెత్తగా అభ్యంతరం తెలియజేశారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే విజయ్‌చంద్ర పోలీసులపై చిర్రుబుర్రులాడారు. ‘మాకు నచ్చిన రంగు చొక్కాలు ధరిస్తాం. అభ్యంతరం చెప్పడానికి మీరెవర‘ని పోలీసులను నిలదీశారు. ‘ఇక్కడ పార్టీ గుర్తులు ఏమీ లేవు కదా.. మీ ఉన్నతాధికారులేమైనా మీకు సూచనలు చేశారా? అంటూ బెదిరింపులకు దిగారు. అక్కడ నుంచే సీఐతో ఫోన్‌లో మాట్లాడి హెచ్చరికలు జారీ చేశారు. ‘మీకు నచ్చిన చొక్కాలు వేసుకుని తిరగండి.. ఎవరు అడుగుతారో చూద్దాం‘ అంటూ శ్రేణులకు సూచించడం గమనార్హం.
● పాలకొండలోని పలు వార్డుల్లోని పోలింగ్ కేంద్రాల్లో పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ, ఎమ్మెల్సీ గ్రీష్మ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భూదేవి హల్‌చల్ చేశారు. అందరికీ నమస్కారం చేస్తూ, అక్కడి ఎన్నికల సిబ్బందికి సూచనలు చేస్తూ కనిపించారు. ఏ ఒక్క అధికారీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం.


