క్యూలో నిల్చొని ఓటు వేసిన కలెక్టర్
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీకి ఆదివారం జరిగిన ఎన్నికలు స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమయ్యింది. నిర్ణీత సమయం 5 గంటల దాటిన తర్వాత కూడా.. కొందరు లైన్‌లో ఉండటంతో ముందుగా స్లిప్పులు ఇచ్చి, వారికి ఓటింగుకు అవకాశం కల్పించారు. తొలుత మందకొడిగా సాగినా.. క్రమంగా జోరందుకుంది. చివరికి వచ్చేసరికి ఆశించిన స్థాయిలో ఓటింగు శాతం నమోదు కాకపోవడం గమనార్హం. మూడు చోట్ల మొత్తం 1,06,165 మంది ఓటర్లు ఉండగా... 71,934 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు లేక ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. మంచినీరు, ర్యాంపులు, వీల్ చైర్లు వంటి కనీస సౌకర్యాలు చాలా చోట్ల కానరాలేదు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఓటు వేసేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీల్‌చైర్ అందుబాటులో లేకపోవడంతో ఇతరుల సహాయంతో పోలింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి వచ్చింది. పార్వతీపురం మున్సిపాల్టీ పరిధిలో చాలా మందికి ఓటు హక్కు ఉన్నప్పటికీ సచివాలయ సిబ్బంది ఓటరు స్లిప్పులు అందించలేకపోయారు. దీంతో కొన్ని చోట్ల చేతి రాతతో అప్పటికప్పుడు ఓటరు స్లిప్పులు రాసివ్వగా.. మరికొన్ని చోట్ల ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరిగారు. దూర ప్రాంతాల నుంచి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లు వార్డుల మార్పులు, చేర్పులు కారణంగా గందరగోళానికి లోనయ్యారు. తమ ఓటు వివరాలు ఎక్కడున్నాయో తెలుసుకోలేక ఇబ్బందులు పడ్డారు. అస్తవ్యస్త వార్డుల విభజన వల్ల కుటుంబంలో ఓట్లు చెల్లాచెదురయ్యాయి. భర్తకు ఒక చోట.. భార్యకు మరో చోట ఓట్లు వచ్చాయి. సచివాలయ సిబ్బంది కొంతమందికి మాత్రమే ఓటరు స్లిప్పులు అందించారని, మరికొందరికి ఇవ్వలేదని ఓటర్లు ఆరోపించారు. ఈ ఘటనల వల్ల పోలింగు సరళి బాగా పడిపోయింది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ.. పట్టణ ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు.
పార్వతీపురంలో ఓటు వేసేందుకు వస్తున్న వృద్ధుడు
సాలూరులోని 17, 28, 28 వార్డుల్లో అధికార పార్టీ శ్రేణులు పోలింగు కేంద్రాల సమీపంలోనే డబ్బులు పంచినట్లు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపించారు. 25వ వార్డు రెండో పోలింగు కేంద్రంలో విధుల్లో ఉన్న ఓ ఎన్నికల ఉద్యోగి.. అధికార పార్టీకి మద్దతుగా ఓటర్లను ప్రభావితం చేసినట్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థి హైమావతి ఆరోపించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, సాధారణ పౌరుడిలా క్యూలో నిల్చొని తన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటు కేవలం హక్కు మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును నిర్ణయించే బాధ్యత అని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. బెలగాంలోని ’పిఎం శ్రీ’ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంతో పాటు పలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా తాగునీరు, నీడ, లైటింగ్, దివ్యాంగులకు ర్యాంప్ వసతి వంటి ప్రాథమిక సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లాలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని, సీసీ టీవీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా పరిశీలించారు.


