పోలింగ్‌ కేంద్రాలపై నిఘా ఏదీ? | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాలపై నిఘా ఏదీ?

Nov 1 2026 12:39 AM | Updated on Nov 1 2026 12:39 AM

పోలింగ్‌ కేంద్రాలపై నిఘా ఏదీ?

● 122 పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు నిల్‌

● ప్రతిచోటా సీసీ కెమెరా అమర్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్‌

● 229 కేంద్రాల్లో 107 చోట్లే సీసీ కెమెరాలు

విజయనగరం అర్బన్‌/బొబ్బిలి: మున్సిపల్‌ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంపై సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరా అమర్చాలని ఆదేశించింది. వీటిని కాదని విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో 229 పోలింగ్‌ కేంద్రాల్లో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలైన 107 చోట్ల మాత్రమే సీసీ కెమెరాలు, వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాట్లు చేయడం విమర్శలకు తావిస్తోంది. అన్నిచోట్లా నిఘా ఏర్పాట్లపై స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నగరంలోని 62 వార్డులు, మేయర్‌ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 2,23,050 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,15,015 మంది మహిళలు, 1,08,010 మంది పురుషులు, 25 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 229 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 122 (53.28 శాతం) సాధారణ కేంద్రాలు, 81 సమస్యాత్మక, 26 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలు కలిపి 107 (46.72 శాతం) మాత్రమే. మిగిలిన 122 సాధారణ కేంద్రాల్లోనూ కెమెరాల నిఘా ఉందా? లేదా? అన్నది ఇప్పడు కీలకంగా మారింది. మొత్తం కేంద్రాల్లో సగానికిపైగా సాధారణ కేంద్రాలే ఉండగా, వాటిలో పర్యవేక్షణ ఏర్పాట్లపై అధికారుల నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం గమనార్హం. వార్డు సభ్యుల స్థానాలకు 169 మంది, మేయర్‌ పదవికి ఏడుగురు పోటీలో ఉన్న నేపధ్యంలో ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభ్యర్థులు కోరుతున్నారు.

● బొబ్బిలి మున్సిపాలిటీలో 49,482 మంది ఓటర్లకు 69 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సెన్సిటివ్‌, హైపర్‌సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాలుగా 25 గుర్తించారు. ఈ కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒక కెమెరా బయట, మరో కెమెరా పోలింగ్‌కేంద్రం లోపల అమర్చారు. మిగతా పోలింగ్‌ కేంద్రాల్లో అమర్చలేదని ఓటర్లు, స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ఏదేని జరగరాని సంఘటనల నేపథ్యంలో విచారణకు ఆటంకం తప్పదన్న వాదన వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement