బొబ్బిలి రూరల్: మండలంలోని అలజంగి గ్రామానికి చెందిన 300 కుటుంబాలకు చెందిన ఓటర్లు టీడీపీ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో శనివారం చేరారు. గ్రామంలో రేజేటి వీధికి చెందిన వారంతా ఎంపీటీసీ అభ్యర్థి పూడి సింహాచలం ఆధ్వర్యంలో జెడ్పీటీసీ అభ్యర్థి శంబంగి వేణుగోపాలనాయుడు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరగా వారందరికీ వేణుగోపాలనాయుడు పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలను పొందిన తమ కుటుంబాలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలనలో వివక్షకు గురౌతున్నామని, తమకు పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేకపోగా సంక్షేమం అందని ద్రాక్షలా మారిందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు పరిపాలన దక్షత, వైఎస్సార్సీపీ విధానాలు,సంక్షేమ పథకాలు తమకు ఎంతగానో అండగా నిలిచాయన్నారు. వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు త మ్మిరెడ్డి దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.


