పార్వతీపురం రూరల్: నీటి కోసం ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు అర్థాంతరంగా తనువు చాలించాడు. పార్వతీపురం మండలం అడ్డపుశీల గ్రామ శివారులో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కృష్ణపల్లి గ్రామానికి చెందిన గర్భాపు రాకేష్ (18) పాలిటెక్నిక్ విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అక్టోబరు 29వ తేదీ సాయంత్రం తాగునీరు తెచ్చేందుకు తన పల్సర్ ద్విచక్ర వాహనంపై వాటర్ క్యాన్ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఫలితం దక్కలేదు. చివరకు శనివారం అడ్డపుశీల గ్రామ శివారు ప్రాంతంలో శవమై కనిపించాడు. మృతదేహం పక్కనే అతడు తీసుకెళ్లిన వాటర్ క్యాన్, పల్సర్ బైక్ పడి ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. రాకేష్ మృతికి గల కారణాలు తెలియరాకపోవడంతో.. ఇది అనుమానాస్పద మృతిగా మారింది. సమాచారం అందుకున్న పార్వతీపురం రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..
పాలకొండ రూరల్: నగర పంచాయతీ పరిధి ఎన్‌కే రాజపురానికి చెందిన కొవగాన వాసు (32) శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి స్వగృహానికి తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. ఇంటి ఇన్ గేట్ సమీపంలో రోడ్డుపై నిలిచి ఉన్న పశువులను తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం సమయంలో రోడ్డుపై పడి ఉన్న వాసును స్థానికులు గుర్తించి పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి, కుటుంబీకులకు సమాచారం అందించారు. అప్పటికే వాసు మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. నగర పంచాయతీ ఎన్నికలు కావటం, తన కుటుంబ సభ్యులు బరిలో నిలవటంతో అప్పటి వరకూ సహచరులతో కలసి ఉన్న వాసు మరణ వార్త విని స్నేహితులు, బంధువులు షాక్‌కు గురయ్యారు. అందరితో కలివిడిగా ఉండే తమ స్నేహితుడు లేడన్న విషయం తెలుసుకుని పెద్దెత్తున సహచరులు ఆస్పత్రికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సంతాపం తెలిపారు. మృతుడికి భార్య జ్యోతిర్మయి, పిల్లలు వీక్షిత్, జశ్వంత్ ఉన్నారు. వాసు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు.
చంపావతిలో కొట్టుకుపోయి
వృద్ధుడు..
నెల్లిమర్ల: గుర్ల మండలం కోటగండ్రేడు గ్రామానికి చెందిన కొండపల్లి వీర్రాజు (65) చంపావతి నదిలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందాడు. వీర్రాజు పైడితల్లమ్మ పండగ కోసమని విజయనగరంలోని పూల్‌బాగ్ ప్రాంతంలో ఉంటున్న తన కుమారుల ఇంటికి అక్టోబరు 26న భార్యతో కలిసి వెళ్లాడు. అక్టోబరు 30న మధ్యాహ్నం పింఛన్ తీసుకోవాలని కుటుంబ సభ్యులకు చెప్పి పూల్‌బాగ్ నుంచి కోటగండ్రేడుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో మొయిద నారాయణపట్నం బ్రిడ్జి దగ్గర కాలకృత్యాల నిమిత్తం చంపావతి నది వద్దకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో పడిపోయాడు. తుఫాన్ నేపథ్యంలో నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆయన ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. మృతుని కుమారుడు కొండపల్లి హరినాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ జి.గోపాలరావు తెలిపారు.
విద్యుదాఘాతానికి మహిళ..
సీతంపేట: మండలంలోని హడ్డుబంగి గ్రామానికి చెందిన బిడ్డిక పెంటమ్మ (43) శనివారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. తన ఆవులను మేతకు పెంటమ్మ పొలాల్లోకి తీసుకువెళ్లింది. ఈ క్రమంలో కిందకు వేలాడి ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైర్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి భర్త బిడ్డిక కృష్ణారావు, కుమారుడు ప్రశాంత్, కుమార్తెలు మాదర, మనీష ఉన్నారు. ఈమె మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. ఎస్‌ఐ వై.అమ్మన్నరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే వల్లే నిండు ప్రాణం పోయిందని గ్రామస్తులు మండిపడ్డారు. కొన్ని నెలలుగా పొలాల్లో విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని సంబంధిత సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ నీలిమ మాట్లాడుతూ ఇటీవల కురిసిన అర్నబ్ తుఫాన్‌కు విద్యుత్ స్తంభం ఒరిగిందన్నారు. లైన్ లూజు కావడంతో ప్రమాదం సంభవించిందన్నారు.
యువకుడి అనుమానాస్పద మృతి


