● పోలింగ్ కేంద్రాలున్న భవనాలకు 4న
స్థానిక సెలవు : కలెక్టర్
విజయనగరం రూరల్/గంటస్తంభం: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు. రీషెడ్యూల్ చేసిన ఎన్నికల పోలింగ్ నవంబరు 5న నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్‌కు ముందు రోజైన 4న పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించినట్లు తెలిపారు. 5న పోలింగ్ ప్రక్రియ నిర్వహించే అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలు, ఇతర ప్రభుత్వ పరిధిలోని భవనాలకు సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల రోజున ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా, సంబంధిత ఎన్నికల ప్రాంతాల్లోని దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఇతర సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు (పెయిడ్ హాలిడే) ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ, ప్రైవేటు సంస్థలకు, కంపెనీలకు 5న స్థానిక సెలవుగా ప్రకటించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం ఉత్తర్వులను సంబంధిత శాఖల అధికారులు, సంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా అమలు చేయాలని, నిబంధనల ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
3 నుంచి మద్యం షాపులు మూసివేత
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్‌కు 48 గంటల ముందుగా మద్యం దుకాణాలను మూసివేయడం జరుగుతుందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. నవంబరు 3న ఉదయం 7 గంటల నుంచి 5వ తేదీ పోలింగ్ ప్రక్రియ ముగిసే సమయం వరకు సంబంధిత పోలింగ్ ప్రాంతాల పరిధిలో మద్యం దుకాణాలను మూసి వేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994లోని సెక్షన్ 225–ఏ ప్రకారం ఈ ఆదేశాలను అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.


