● నులిపురుగుల నిర్మూలనతో పిల్లల్లో రక్తహీనత నివారించవచ్చు
● కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి
పార్వతీపురం రూరల్: జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన (డీ వార్మింగ్) కార్య క్రమం శుక్రవారం జరిగింది. స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి పాల్గొని, విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. నులిపురుగుల నిర్మూలనతో పిల్లల్లో రక్తహీనత నివారించవచ్చని, 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఈ మాత్రలు అందించాలని ఆయన పేర్కొ న్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తర్వాత మాత్రమే మాత్రలు వేయాలని, అనారోగ్యంతో ఉన్నవారికి ఇవ్వరాదని అధికారులను ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో వైద్య కిట్లు సిద్ధంగా ఉంచాలన్నారు. శుక్రవారం మాత్రలు వేసుకోని పిల్లలకు అక్టోబర్ 5న నిర్వహించే ‘మాప్–అప్’ కార్యక్రమంలో తప్పనిసరిగా అందించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యవేక్షణాధికారి జి.వీర్రాజు, డీఎంహెచ్‌ఓ పి.విజయలక్ష్మి, నోడల్ అధికారి డాక్టర్ జగన్‌మోహనరావు, డీఈఓ బ్రహ్మాజీ, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ పద్మావతి, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు కథనాలపై కలెక్టర్ సీరియస్!
● పత్రికా సంస్థకు లీగల్ నోటీసులు
సాక్షి, పార్వతీపురం మన్యం: అసత్యమైన, నిరాధారమైన వార్తలు ప్రచురిస్తూ, తన పరువుకు భంగం కలిగించిన ఓ పత్రికా సంస్థ (‘సాక్షి’ కాదు)కు కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి లీగల్ నోటీసులు పంపారు. ఇటీవల ఓ పత్రికలో, యూట్యూబ్ ఛానల్‌లో ‘కలెక్టర్‌కు మేత’ శీర్షికన వచ్చిన వార్తా కథనం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారమైంది. జిల్లాలో ఉపాధి పనుల అమలుకు సంబంధించి ఆ ప్రచురణలో ఆరోపణలు, పరోక్ష విమర్శలున్నాయి. ఈ పనులకు సంబంధించి భారీ మొత్తంలో డబ్బు కమీషన్‌గా వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తూనే.. జిల్లా కలెక్టర్ అయిన తన క్లయింట్ కార్యాలయం, పనితీరును ముడిపెట్టారని కలెక్టర్ తరఫు న్యాయవాది సదరు సంస్థకు పంపిన నోటీసులో పేర్కొన్నారు. పాఠకుల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేలా ఉన్న ఆ కథనం.. పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని, పరువు నష్టం కలిగించేదిగా తెలిపారు. తన క్లయింట్ అయిన కలెక్టర్ పేరు, ఫొటోను ప్రచురించడం ద్వారా ప్రభుత్వ అధికారిగా ఆయనకు ఉన్న కీర్తి, గౌరవం, వృత్తిపరమైన హోదా, విశ్వసనీయతకు తీవ్రమైన హాని కలిగించారని నోటీసులో పేర్కొన్నారు.
వ్యక్తిగతంగా కక్షగట్టి చేస్తున్నారని
కలెక్టర్ ఆగ్రహం..
ఇటీవల కలెక్టర్ ప్రభాకరరెడ్డి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంగా పలు మాధ్యమాల్లో కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఇవన్నీ తప్పుడు కథనాలుగా కొట్టిపారేస్తున్న కలెక్టర్.. దీని వెనుక కొంతమంది టీడీపీ నాయకుల హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. ఆయా కథనాలను తీవ్రంగా ఖండిస్తూనే.. ఫేక్ న్యూస్ ప్రచురించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల సమావేశంలోనే వెల్లడించారు. సమావేశం జరిగిన రెండు రోజులకే ఓ కథనం ఆయన వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించేలా ప్రచురణ అవ్వడం.. అందులో టీడీపీ నాయ కుల హస్తం ఉన్నట్లు బయటకు రావడం చర్చనీయాంశమైంది. పార్వతీపురం మండలం ఎల్‌ఎన్ పురం గ్రామంలోని గ్రామస్తులు సైతం అటువంటి తప్పుడు వార్తలు ప్రచురించి తమ ఊరి పరువు తీశారని టీడీపీకి చెందిన సదరు వర్గంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సదరు సంస్థపై కలెక్టరు లీగల్ చర్యలకు దిగారు.
ఎస్‌డబ్ల్యూఎఫ్ మౌన ప్రదర్శన
విజయనగరం క్రైమ్: ఆర్టీసీ సంస్థ నిబంధనలను తుంగలోకి తొక్కి.. సంస్థకు నష్టం చేకూర్చుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ శుక్ర వా రం ఆందోళన చేసింది. విజయనగరం ఆర్టీసీ డిపో ఎదుట మౌన ప్రదర్శన నిర్వహించింది. నిరసన ప్రదర్శనలో ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకు లు లక్ష్మి, చంద్రయ్య, పద్మావతి పాల్గొన్నారు.


