ఒడిశాలో కురిసిన వర్షాలకు నాగావళి నదికి వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. తోటపల్లి బ్యారేజీ వద్ద నీటి మట్టం, వరద ప్రవాహం గణనీయంగా పెరగడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు 38,716 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదు కాగా స్పిల్‌వే నుంచి 45,461 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇన్‌ఫ్లో 28,250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదుకావడంతో స్పిల్‌వే నుంచి 23,050 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు వద్ద 105 మీటర్ల లెవెల్‌కు గాను 103.76 నీరు నిల్వ ఉంది.
తోటపల్లికి వరద పోటుతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు వద్ద ఉంచి నీటి మట్టం, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లోను నిరంతరం పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శేషుబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మన్మథరావు ప్రాజెక్టును సందర్శించి పరిస్థితులపై ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.


