మన్యం జెడ్పీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మన్యం జెడ్పీ ప్రారంభం

Sep 26 2026 1:20 AM | Updated on Sep 26 2026 1:20 AM

సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నర్సిపురంలోని తాత్కాలిక భవనంలో సేవలను శుక్రవారం నుంచి అధికారికంగా ఆరంభించారు. ప్రస్తుతం పాలక వర్గాలు ముగియడంతో ప్రత్యేకాధికారి పాలన అమల్లోకి వచ్చింది. కార్యాలయాన్ని ప్రారంభిస్తూనే, కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి ప్రత్యేకాధికారిగా వెనువెంటనే బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది తమను పరిచయం చేసుకుంటూ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతేక అధికారి మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఉమ్మడి విజయనగరంతో కలిసి ఉన్న జెడ్పీ.. ఇకపై ప్రత్యేకమని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పార్వతీపురం జిల్లా కేంద్రంలో సేవలు ప్రారంభించామని వివరించారు. ఇక మీదట స్వతంత్ర పాలనకు నాంది కానుందని.. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి, ఎన్నికల నిర్వహణకు దోహదపడుతుందని తెలిపారు. ఎన్నికలు జరిగిన తర్వాత 15 మండలాల సభ్యుల పాలక వర్గం ఇక్కడే కొనసాగుతుందని చెప్పారు. ఇక్కడ మొత్తం 26 మంది సిబ్బందిని కేటాయించారని.. 19 మంది విజయనగరం, ఏడుగురు శ్రీకాకుళం నుంచి వచ్చారని తెలిపారు. జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులు కొత్తగా కేటాయించారని, ప్రభుత్వం నుంచి నియామకం పూర్తయిన వెంటనే వారు విధుల్లో చేరుతారని చెప్పారు.

అరకొర వసతులే..

జిల్లా పరిషత్‌ విభాగం నర్సిపురంలోని గతంలో సచివాలయం కోసం నిర్మించిన భవనంలో తాత్కాలికంగా సేవలను ప్రారంభించింది. కార్యాలయం అయితే ప్రారంభం అయ్యింది గానీ... 26 మంది సిబ్బందికి, అధికారులకు వీలుగా వసతులు, సౌకర్యాలు లేవు. కుర్చీలు, టేబుళ్లు, కంప్యూటర్లు రాలేదు. దీంతో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కావడానికి మరి కొద్ది రోజులు సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేని విషయం విదితమే. అందులో మరో కార్యాలయం చేరినట్లు అయ్యింది.

ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌

అరకొర వసతులతోనే కార్యకలాపాలు ఆరంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement