దరఖాస్తులకే రెండేళ్లు.. పింఛన్లకు ఇంకెన్నాళ్లు? | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులకే రెండేళ్లు.. పింఛన్లకు ఇంకెన్నాళ్లు?

Sep 8 2026 1:41 AM | Updated on Sep 8 2026 1:41 AM

దరఖాస్తులకే రెండేళ్లు.. పింఛన్లకు ఇంకెన్నాళ్లు?

భర్త మరణించినా..

ఎన్నిసార్లు తిరుగుతున్నా..

చలించేవారే కరువు

ఆదుకోండయ్యా..

సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్‌:

స్థానిక ఎన్నికల సన్నద్ధత వేళ.. సామాజిక భద్రత కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఇప్పటి వరకూ కొత్తగా ఒక్క పింఛన్‌ కూడా మంజూరు చేయలేదు. కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా.. పింఛన్‌ ఎర వేస్తోంది. ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకూ స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హతలు, ఈకేవైసీ పరిశీలన పూర్తయ్యాకే కొత్త పింఛన్లు అందుతాయి. ఇక్కడ కూడా నిబంధనల్లో చంద్రబాబు ప్రభుత్వం మెలిక పెట్టింది. సెర్ప్‌ ద్వారా బడ్జెట్‌ ప్రతిపాదనలు బట్టే.. మంజూరవుతాయని చెప్పడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల వల్ల ఒక పంచాయతీలో 60–70 మంది అర్హులు ఉంటే.. ఆరుగురు, ఏడుగురికి కూడా లబ్ధి చేకూరే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వేలాది మంది పింఛన్ల లబ్ధికి దూరమయ్యారు. జిల్లాలో ప్రస్తుతం 1,36,471 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ.58.09కోట్లు పింఛన్‌ రూపంలో అందుతోంది. ఈ బడ్జెట్‌ పెరిగితేనే పింఛన్లు అందుతాయి. లేదంటే కష్టమే అన్నవాదన వినిపిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో ఏడాదికి రెండు మార్లు దరఖాస్తులు స్వీకరించి, అర్హత ఉన్న వారందరికీ పింఛను మొత్తం వెనువెంటనే అందించేవారు. రెండేళ్లుగా ఆ పరిస్థితి లేదు. ఇప్పటికీ బాధితులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యిందని.. క్షేత్ర స్థాయిలో పరిశీలన పూర్తయ్యాక, అన్ని అర్హతలూ ఉంటే పింఛన్లు మంజూరవుతాయని డీఆర్డీఏ పథక అధికారి ప్రభావతి తెలిపారు.

ఈ చిత్రంలోని మహిళ పేరు మిత్తిరెడ్డి పార్వతి. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర గ్రామం. భర్త మరణిణించడంతో చిన్నారి అయిన కుమార్తెతో బతకడమే కష్టంగా ఉంది. కొన్నాళ్ల కిందట నర్సిపురంలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది. తండ్రి మరణించడం.. తల్లికి పింఛన్‌ వస్తుండడం వల్ల మ్యాపింగ్‌ ప్రక్రియలో ఇబ్బందిగా మారింది. తల్లికి పింఛను రావడం వల్ల.. పార్వతి పెట్టిన దరఖాస్తును ఎవరూ తీసుకోవడం లేదు. తనకు పింఛను మొత్తం మంజూరు చేసి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది.

గరుగుబిల్లి మండలం తోటపల్లికి చెందిన మార్కుండ మంజు పూర్తిగా మంచానికే పరిమితం అయ్యింది. లేవలేదు, ఏ పనీ చేయలేదు. ప్రస్తుతం రూ.6 వేల పింఛను వస్తోంది. నిబంధనల ప్రకారం రూ.15 వేలు పింఛను ఇవ్వాలని అధికారుల చుట్టూ కుటుంబ సభ్యులు తిరుగుతూనే ఉన్నారు.

ఈ వృద్ధురాలి పేరు ముని సుబ్బమ్మ. సీతానగరం మండలం జోగింపేట గ్రామం. భర్త లేరు. వితంతు పింఛను గానీ, వృద్ధాప్య పింఛను గానీ అందడం లేదు. అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఏ ఆధారమూ లేక, బతకడమే కష్టంగా ఉందని... తన దీన పరిస్థితి చూసి అయినా ఎవరూ చలించడం లేదని ఆమె వాపోతోంది.

కొమరాడ మండలం విక్రంపురం గ్రామా నికి చెందిన తామరఖండి గుంపయ్యకు 68 ఏళ్లు. ముందు వెనకా ఎవరూ లేరు. వయసు మీద పడడంతో ఏ పనీ చేసుకోలేక పోతున్నాడు. జీవనం కష్టంగా మారిందని, పింఛను వచ్చినా కాస్త అండగా ఉంటుందని ఆయన చెబుతున్నాడు. తన దయనీయ స్థితిని చూసి పింఛను లబ్ధి కలిగించాలని కోరుతున్నాడు.

బడ్జెట్‌ ఉంటేనే పింఛన్లు మంజూరు

నిబంధనల్లో ప్రభుత్వం మెలిక

ఒక పంచాయతీలో 60–70 మంది అర్హులు ఉంటే.. ఆరుగురు, ఏడుగురికే మంజూరు..

స్థానిక ఎన్నికల సమయాన ఎర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement