కొమరాడ మండలంలో నాగావళి వద్ద ప్రమాదకరంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని.. నదికి వరద వస్తే, గ్రామాలే ముంపు బారిన పడే ఆస్కారం ఉందని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తంచేశారు. కొమరాడ మండలం చోళపదం–1 గ్రామాల సమీపంలో నాగవళి నదిలో 18,900 మెట్రిక్ టన్నుల పూడిక తీత పనిని ఏజెన్సీకి జిల్లా జల వనరుల శాఖ ఖరారు చేసి గత మే నెలలో అప్పగించిందని, ఇప్పుడు ఇసుక తవ్వకాలు దేవుకోన పంచాయతీ పూర్ణపాడు రెవెన్యూ పరిధిలో జరుగుతున్నాయంటూ గగ్గోలుపెట్టారు. భారీ యంత్రాలతో గాంధీనగరం, రామభద్రపురం గ్రామాలకు అతి సమీపంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, దీనివల్ల తమ గ్రామాలకు పెనుముప్పు ఉందని ఆయా ప్రాంత ప్రజలు అధికారులకు విన్నవించారు. తక్షణమే ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని కోరారు.


