పార్టీ ఇచ్చిన ఐడీ కార్డులను చూపిస్తున్న వివిధ విభాగాల ప్రతినిధులు
పార్వతీపురం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు అధ్యక్షతన సోమవారం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్న దొర, పాముల పుష్పశ్రీవాణి, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, అరకు పార్లమెంట్ పరిశీలకుడు శరగడం చిన్న అప్పలనాయుడు, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గ పరిశీలకులు మావుడి శ్రీనివాసరావు, జమ్మాన ప్రసన్నకుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ మరిశర్ల బాపూజీ నాయుడు, పలు అనుబంధ విభాగాల జిల్లా స్థాయి నాయకులు, పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల మండల, పట్టణ స్థాయి ముఖ్య నాయకులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాలన్నారు. అనంతరం నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఐడీ కార్డులను అందజేశారు.
కూటమి ప్రజావ్యతిరేక విధానాలను
విస్తృతంగా ప్రచారం చేయాలి
స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేతలు


