● పార్వతీపురం మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు వేధింపులు
సాక్షి, పార్వతీపురం మన్యం: అవినీతికి చిరునామాగా మారిన పార్వతీపురం మున్సిపాలిటీ.. నడిపించే వారు లేక, ఎవరికి తోచిన రీతిలో వారు దోచుకునేస్తున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తాజాగా మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ వ్యవహార శైలిపై కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అక్కడితో ఆగక.. కలెక్టరు కార్యాలయ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీలో చెత్త, కాలువల శుభ్రత, ఇతర పారిశుద్ధ్య పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు.. విధులకు ఒక నిమిషం ఆలస్యమైనా వారం నుంచి 10 రోజు ల వరకు పని నిలుపు చేస్తున్నారని, మళ్లీ పని కావాలంటే రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు కార్మికులు ఆరోిపించారు. ఆయనకు నచ్చితే ఒకలా, లేకుంటే మరోలా వ్యవహరిస్తూ వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరోగ్యం బాగులేకున్నా చేయాల్సిందే..
ఎవరైనా అనారోగ్యం బారిన పడితే సెలవు ఇవ్వడానికి సదరు అధికారి ససేమిరా అంటున్నారని కార్మికులు చెబుతున్నారు. గతంలో పబ్లిక్ సెలవు దినాల్లో కార్మికులు ఉదయం విధులు పూర్తిచేసుకుని, మధ్యాహ్నం సెలవు తీసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకపోయింది. గతంలో రాత్రిపూట పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులు తొమ్మిది మంది వరకు ఉండేవారు. ప్రస్తుతం ఆరుగురు అయ్యారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ తీరు వల్లే ఈ పరిస్థితి వస్తోందని.. గతంలో మూడుసార్లు సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనిచేసిన మున్సిపాలిటీల్లోనూ ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఫకీర్ రాజు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం యూనియన్ నాయకులు గొర్లి వెంకటరమణ, బి.వి.రమణ, పి.వరదరాజు, సింహాచలం, ఎన్.శంకరరావు తదితరులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.


