పార్వతీపురం: ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కారవేదిక(పీజీఆర్‌ఎస్)లో ప్రజలు తమ వినతులను సమర్పించవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల వివరాలు, వాటి స్థితిని మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవడంతోపాటు1100 టోల్‌ఫ్రీ కాల్‌సెంటర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చునన్నారు. కలెక్టరేట్‌లో ప్రతిరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
క్యూఆర్ కోడ్ ద్వారా స్పందన ఇవ్వండి
పీజీఆర్‌ఎస్ ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను వెల్లడించాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి కోరారు. జిల్లా, మండల స్థాయి పీజీఆర్‌ఎస్ కేంద్రాల్లో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎండలకు అల్లాడుతున్న ఏనుగులు
భామిని: ఎండల తీవ్రతకు ప్రజలతో పాటు ఏనుగుల గుంపు అల్లాడుతోంది. ఆదివారం మరీ ఎక్కువైన ఎండ వేడికి మండలంలోని నులకజోడు సమీప తివ్వాకొండ పరిసరాల్లో గల మామిడి చెరువులో నాలుగు ఏనుగుల గుంపు అత్యధిక సమయం కాలక్షేపం చేశాయి. నీటిలో జలకాలాడుతూ ఉపశమనం పొందాయి. సాయంత్రం నిదానంగా ఒడ్డుకు చేరి సమీపంలోని పంట పొలాల్లో మేశాయి. రైతు పండించిన జొన్న పంటను నాశనం చేసి తినివేశాయి.
డ్రగ్స్ డైరీ ఆవిష్కరణ
పాలకొండ రూరల్: మాదకద్రవ్యాల వినియోగంతో తప్పుదోవ పడుతున్న వారు సన్మార్గంలో నడవాలని పాలకొండ సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఎం.రాంబాబు అన్నారు. మాద్రకద్రవ్యాల వినియోగం, విక్రయాలపై ఉక్కుపాదం మోపే క్రమంలో స్థానిక పోలీసులతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాజాగా ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించేందుకు ‘డ్రగ్స్ డైరీ’ అనే షార్ట్ ఫిలిమ్ తీయించారు. స్థానిక యువత, కళాకారులను ఇందులో పాత్రధారులుగా ఎంచుకున్నారు. వారితో మత్తు పదార్థాల వినియోగం, రవాణా, అమ్మకాల వల్ల జీవితాలు, కుటుంబాలు ఏవిధంగా నాశనమవుతాయనే సందేశాన్ని అందించారు. ఈ లఘు చిత్రాన్ని డీఎస్పీ ఆదివారం పాత్రధారులతో కలిసి తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ లింకును గ్రూపుల్లో విడుదల చేశారు. ఈ షార్ట్ ఫిలిం రూపకల్పనకు సహకరించిన విశ్వజల్లు టీమ్ సభ్యులను అధినందించారు.
విజయనగరం టౌన్: సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 50–55 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి విజయనగరం రైల్వేస్టేషన్‌కి దగ్గరలో ఆదివారం మృతిచెందాడు. మృతుడి శరీరంపై తెలుపు, నీలం రంగు ఉన్న పుల్‌హ్యాండ్స్ షర్ట్, ఎరుపు,పసుపు, నీలం రంగు గల రగ్గు కప్పుకుని ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9247585742 నంబర్‌ను సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ వీఎన్.మూర్తి కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.


