రాజన్నదొర మానవత్వం | - | Sakshi
Sakshi News home page

రాజన్నదొర మానవత్వం

Sep 7 2026 3:08 AM | Updated on Sep 7 2026 3:08 AM

సినిమా చూపించి చిన్నారుల కోరికను తీర్చిన మాజీ డిప్యూటీ సీఎం

సాలూరు/సాలూరు రూరల్‌: మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. చిన్నారుల ముఖంలో చిరునవ్వులు చూడడానికి వారి మనసులో చిన్న కోరికను అర్థం చేసుకుని పెద్దమనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..ఇటీవల విడుదలైన ఇరుముడి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమా గురించి ప్రజలు ఆసక్తిగా చర్చించుకోవడం, బాగుందంటూ ప్రశంసించడం పట్టణంలో నవజీవన్‌ఆశ్రమ పాఠశాలలోని చిన్నారుల చెవిన పడింది. ఆశ్రమంలో సుమారు 72 మంది అనాథ, నిరాశ్రయ చిన్నారులు ఉన్నారు. వారిలో చాలా మంది చిన్నారులు ఈ సినిమా చూడాలని ఆశపడ్డారు. అయితే థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే పరిస్థితులు తమకు లేవని వాపోయి తమ చిన్న కోరికను మనసులోనే దాచుకున్నారు. చిన్నారుల కోరిక చిన్నదే కావచ్చు. కానీ వారి పరిస్థితి కారణంగా అది వారికి అందని కలగా మారింది.

ఈ నేపథ్యంలో చిన్నారుల కల విషయం రాజన్నదొర వద్దకు చేరింది. చిన్నారుల కోరిక రాజన్నదొరను కదలించింది. అంతే ఆలస్యం చేయకుండా చిన్నారులందరినీ సినిమా చూసేందుకు టికెట్లు, రాకపోకలు, ఇతర ఖర్చులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఆదివారం స్వయంగా ఆయనే పట్టణంలో లక్ష్మి,శ్రీలక్ష్మి థియేటర్స్‌కు చేరుకుని చిన్నారులతో ముచ్చటించి థియేటర్‌లోకి వారిని పంపించారు.

చిన్నారుల కళ్లలో ఆనందం

ఈ సినిమా చూడాలని ఆశించిన ఆ చిన్నారుల కోరిక నిజమైంది.సినిమా చూసేందుకు వెళ్లిన పిల్లల ముఖాల్లో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. తమ కోరికను నేరుగా వచ్చి నెరవేర్చిన రాజన్నదొరకు వారు, ఆశ్రమ నిర్వాహకులు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

రాజన్నదొర మానవత్వంపై ప్రశంసలు

అధికారంలో ఉండడం వేరు. మనసుల్లో ఉండడం వేరు. పదవులు మారవచ్చు కానీ మానవత్వంతో చేసే మంచి పనులు మాత్రం ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని, చిన్నారుల ఆనందం కోసం నేరుగా ఆయనే కదిలిన రాజన్నదొర మానవత్వం గురించి స్థానికులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement