డోలీ మోతలూ చూసొద్దాం! | - | Sakshi
Sakshi News home page

డోలీ మోతలూ చూసొద్దాం!

Aug 27 2026 1:18 AM | Updated on Aug 27 2026 1:18 AM

మన్యం అందాలే కాదు.. ● రోగికి డోలీ.. మన్యానికి ఇదే దారి ● అత్యవసరమైతే నాలుగు భుజాలే అంబులెన్స్‌ ● కొండలు, గుట్టలు, రాళ్ల బాటల్లో ప్రాణాలతో పోరాటం డోలీ మోతలూ చూసొద్దాం! అత్యవసర వేళ...

మన్యం అందాలే కాదు..
● రోగికి డోలీ.. మన్యానికి ఇదే దారి ● అత్యవసరమైతే నాలుగు భుజాలే అంబులెన్స్‌ ● కొండలు, గుట్టలు, రాళ్ల బాటల్లో ప్రాణాలతో పోరాటం

సాక్షి, పార్వతీపురం మన్యం:

త్యవసర సమయంలో అంబులెన్స్‌ రావాలి ... క్షణాల్లో రోగిని ఆస్పత్రికి తరలించాలి. పార్వతీపురం మన్యం జిల్లా మారుమూల గిరిజన గ్రామా ల్లో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. రోడ్డు సౌకర్యం లేని చోట అనారోగ్యం పాలైన వ్యక్తికి అంబులెన్స్‌ అందని ద్రాక్షగానే మారుతోంది. చివరకు నాలుగు కర్రలు, ఒక మంచం లేదా వస్త్రంతో కట్టిన డోలీయే ప్రాణాలను కాపాడే వాహనంగా మారుతోంది. రోగిని భుజాలపై మోసుకుంటూ కొండలు, గుట్టలు, రాళ్లు రప్పలు దాటి రోడ్డు ఉన్న ప్రాంతానికి తీసుకురావాల్సిన దయనీయ పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. అనారోగ్యం పాలైతే డోలీ... ప్రమాదం జరిగితే డోలీ... ప్రసవ వేదనలు వచ్చినా డోలీ... ఒక్కోసారి మరణించిన వారి మృతదేహాలను కూడా ఇదే డోలీలో మోసుకెళ్లాల్సి వస్తోందన్న వాస్తవం గిరిజన ప్రాంతాల దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది.

గిరిజన ప్రాంతాల్లో చాలా గ్రామాలు కొండలు, అడవులు, లోయల మధ్య విస్తరించి ఉన్నాయి. ప్రధాన రహదారికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటి కీ, ఆ గ్రామాలకు చేరేందుకు సరైన రోడ్డు ఉండదు. దీంతో 108 వంటి అత్యవసర వైద్య వాహనాలు గ్రామం వరకు వెళ్లలేని పరిస్థితి. రోగిని ముందుగా డోలీలో రోడ్డు వరకు తీసుకురావాలి. అక్కడి నుంచి అంబులెన్స్‌ లేదా ఇతర వాహనంలో ఆస్పత్రికి తరలించాలి. ఈలోగా విలువైన సమయం గడిచిపోతోంది. గుండెపోటు, పాము కాటు, ప్రమాదాలు, తీవ్ర జ్వరాలు, ప్రసవ సంబంధ అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆలస్యం ప్రాణాంతకంగా మారే ప్రమా దం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జారుడు బాటలు, రాళ్లు రప్పలు, ఎత్తుపల్లాలు, వర్షాకాలంలో బురద మార్గాలు... ఇలా ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ రోగిని జాగ్రత్తగా తీసుకెళ్లాలి. ఒక్కసారి డోలీ అదుపు తప్పినా పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది.

ప్రకటనలకే పరిమితం అవుతున్న రహదారులు

జిల్లాలో గిరిజన జనాభా అధికంగా ఉండే కొమరా డ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట, సాలూరు, సీతంపేట తదితర ప్రాంతాల్లో మారుమూల ఆవాసాలున్నాయి. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు అరికట్టేందుకు 225 రహదారుల నిర్మాణానికి రూ.88 కోట్లు మంజూరు చేసినట్లు చాలా రోజుల కిందట కలెక్టర్‌ ప్రకటించారు. రానున్న మూడేళ్లలో 320 అనుసంధాన రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని, ఇందులో భాగంగానే 575 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి 610 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించామని ఇటీవల మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఇవన్నీ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. కేవలం రహదారులే కాక.. మారుమూల గ్రామాల్లో ప్రాథమిక వైద్య సేవలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైన చోట మొబైల్‌ మెడికల్‌ యూనిట్లు, అత్యవసర రవాణా వ్యవస్థ, గ్రామస్థాయి ఆరోగ్య సిబ్బంది అందుబాటు పెంచాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. సాలూరు మండలంలో ప్రయోగాత్మకంగా కంటైనర్‌ ఆసుపత్రి సేవలు ప్రారంభించినా.. అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో అందాలు, జలపాతాలు అంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వ యంత్రాంగం.. ఇక్కడి డోలీ మోతలను కూడా సందర్శకులకు చూపించాలని గిరిజన సంఘాల నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement