అమాంతం పెరిగిన నిత్యావసర
సరుకుల ధరలు
మధ్యాహ్నభోజనానికి అరకొర చార్జీలు
భోజనం వండి పెట్టేందుకు
హడలిపోతున్న నిర్వాహకులు
అప్పులు చేస్తున్నాం
రెండు నెలలుగా మెస్‌చార్జీలు ఇవ్వలేదు
వంట నిర్వాహకులకు
వీరఘట్టం:
పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో వంట నిర్వాహకులకు తంటాలు తప్పడం లేదు. ప్రభు త్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం, ఇచ్చిన నిధులు చాలకపోవడంతో విద్యార్థులకు భోజనం వండిపెట్టేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక విద్యార్థికి అన్నం, పప్పు, గుడ్డు, రసంతో భోజనం పెట్టేందుకు వంట నిర్వా హకులకు ప్రభుత్వం బియ్యం, గుడ్లుతో పాటు 1 నుంచి 5వ తరగతి వరకు ఒకరికి రూ.6.19లు, 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదుతున్నవారికి రూ.9.29లను మెస్ చార్జీలుగా ఇస్తోంది. గతేడాది ఫిబ్రవరి నుంచి అవే మెస్ చార్జీలు చెల్లిస్తోంది. అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. ఉల్లిపాయలు కిలో రూ.60, నూనెలు, పప్పులు, పోపు సామగ్రి, వంట గ్యాస్ ఇలా అన్నింటి ధరలు గత మూడు నెలల నుంచి మూడు రెట్లు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అరకొరగా ఇస్తున్న మెస్ చార్జీలు చాలక పాఠశాలల్లో మధ్యాహ్నం వంటలు చేయాలంటే తిరిగి చేతిచమురు వదులుతోందని వంట ఏజెన్సీ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో 1604 ప్రభుత్వ పాఠశాలలు, 14 ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఈ ఏడాది సుమారుగా 1.15 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రతిరోజు 1604 మంది వంట ఏజెన్సీ మహిళలు వంటలు చేస్తున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు వంటలు చేసేందుకు నూనె, పప్పులు, ఉప్పు, కారం, మసాలా దినుసులు, వంట గ్యాస్, వంట చెరకు కొనుగోలు చేసేందుకు గ్రూపులో ఉన్న సభ్యులందరూ తలా కొంత వేసుకుంటారు. ప్రస్తుతం ఒక్కసారిగా నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. మెస్ చార్జీలు పెంచకపోతే ప్రస్తుతం ఉన్న ధరలతో మధ్యాహ్న భోజనం వండలేమని చెబుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా భోజనం చార్జీలు పెంచాలని కోరుతున్నారు.
రెండు నెలలుగా అందని బిల్లులు...
ప్రభుత్వ పాఠశాలల్లో వంటలు చేస్తున్న వంట మహిళలకు ఒక్కొక్కరికీ నెలకు రూ.3000 వేతనం ఇస్తోంది.వీటితో పాటు మెస్ చార్జీలు కూడా ఇస్తోంది.అయితే గత రెండు నెలలుగా వంట బిల్లులు,గౌరవ వేతనాలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వంటలు చేస్తున్న సామాన్య,మద్య తరగతి కుటుంబాలకు చెందిన వంట ఏజెన్సీ మహిళలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గత రెండు నెలలకు సంబందించి ఉన్న బకాయిలు సుమారు రూ.3.08 కోట్లు ఉంటాయని,వాటిని వెంటనే విడుదల చేయాలని వంట ఏజెన్సీ మహిళలు కోరుతున్నారు.
బడిలో వంటలు చేసేందుకు కావాల్సిన పప్పులు, నూనె, కట్టెలు కొనుగోలుకు అప్పు చేస్తున్నాం. ఉల్లిపాయలు కిలో రూ.60 లు ఉంది. ఇక నూనె లీటరు రూ.175లు పలుకుతోంది. ఈ ధరలతో సరుకులు కొనుగోలు చేసి వంటలు చేస్తున్నాం. ప్రభుత్వం ఇస్తున్న అరకొర మెస్ చార్జీలు చాలడం లేదు. మెస్ చార్జీలు పెంచాలి.
– వై.సావిత్రి,వంట ఏజెన్సీ మహిళ, వీరఘట్టం
ఈ సంవత్సరం జూన్ నుంచి బడిలో వంటలు చేస్తు న్నాం. ప్రస్తుతం ఇస్తున్న మెస్ చార్జీలు చాలడం లేదు. గత రెండు నెలలుగా మెస్‌చార్జీలు ఇంకా ఇవ్వలేదు. చేతిలో చిల్లిగవ్వలేక అప్పుచేసి భోజనం వండుతున్నాం. – దూడి పార్వతి,
వంట ఏజెన్సీ మహిళ, వీరఘట్టం


