సర్వేలో ప్రతికూలం.. | - | Sakshi
Sakshi News home page

సర్వేలో ప్రతికూలం..

Aug 27 2026 1:18 AM | Updated on Aug 27 2026 1:18 AM

సర్వేలో ప్రతికూలం..

విజయనగరం ఫోర్ట్‌: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరగడం లేదు. పింఛన్లు ఇంటింటికీ కాకుండా లబ్ధిదారులందరినీ ఒకే చోటుకు రప్పించి ఇస్తున్నట్టు పింఛన్‌ లబ్ధిదారులు గుసగుసలాడుకుంటున్నారు. టీడీపీ సర్కార్‌ నిర్వహించిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో పలువురు లబ్ధిదారులు పింఛన్‌ పంపిణీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటింటికీ వచ్చి పింఛన్లు పంపీణి చేస్తున్నారా అని అడిగినప్పుడు.. చాలా మంది ఇంటింటికీ వచ్చి పింఛన్లు ఇవ్వడం లేదని చెప్పినట్లు సమాచారం.

గతానికి భిన్నంగా..

టీడీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పింఛన్లు పంపిణీ చేసే సమాయాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి పింఛన్లు పంపిణీ జరిగేది. ప్రస్తుతం 8, 9 గంటలైనా సిబ్బంది కానరావడం లేదు. పైగా లబ్ధిదారులందరినీ పంచాయతీ కార్యాలయం వద్దకో.. రచ్చబండ వద్దకో పిలిచి ఒకేసారి పింఛన్లు ఇస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ ఉద్దేశం ఇది..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పింఛన్‌దారులు పంచాయతీ కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షించేవారు. వృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన వారు పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పింఛన్లు తీసుకోవడానికి ఇబ్బంది పడేవారు. అష్టకష్టాలు పడి వెళ్లినా పంచాయతీ కార్యదర్శి ఒక్కరే పింఛన్లు పంపిణీ చేయడం వల్ల గంటల తరబడి అక్కడే నిరీక్షించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వలంటీర్‌ వ్యవస్థ తీసుకువచ్చి లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసింది. తెల్లవారుజాము 5 గంటలకే పింఛన్‌దారుల తలుపు తట్టి నగదు అందించేవారు. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.

సర్వత్రా అసంతృప్తి..

జిల్లాలో 25 సచివాలయాల పరిధిలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ పట్ల లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్ల పంపీణిపై 85.64 శాతం మంది సానుకూలంగా స్పందించగా.. 14.26 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు. పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది డబ్బులు అడుగుతున్నారా అనే ప్రశ్నకు 86.76 శాతం మంది సానుకూలంగా స్పందించగా.. 13.24 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు. నెల్లిమర్ల, మెంటాడ, పూసపాటిరేగ, మెరకముడిదాం, ఎస్‌.కోట, రామభద్రపురం, విజయనగరం మండలాల్లో ఇంటింటికీ పింఛన్లు పంపిణీ పట్ల ఎక్కువమంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లాలో 2,68,072 ఫించన్లు..

జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన 2,68,072 మంది పింఛన్‌దారులున్నారు. వీటిలో వృద్ధాప్య పింఛన్లు 1,28,623 , వితంతు పింఛన్లు 73,727, వికలాంగ ఫించన్లు 35, 538, అభయహస్తం 10,044, ఒంటిరి మహిళా పింఛన్లు 5,117, డప్పు కళాకారులు పింఛన్లు 4,005, చేనేత పింఛన్లు 2,844, గీత కార్మికుల ఫించన్లు 2,876 , మత్య్సకారులు పింఛన్లు 2,129, చర్మకార పింఛన్లు 1548, డీఎంహెచ్‌ఓ పింఛన్లు 870, డయాలసిస్‌ పించన్లు 469, కళాకారుల పింఛన్లు 253, టాన్సజెండర్స్‌ పింఛన్లు 26, సైనిక్‌ వేల్ఫేర్‌ పింఛన్లు 3 ఉన్నాయి.

ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై

అసంతృప్తి వ్యక్తం చేసిన లబ్ధిదారులు

గతంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్ల

అందజేత

నేడు అందుకు భిన్నమైన పరిస్థితి

ఇకపై పక్కాగా...

ఇంటింటికీ ఫించన్ల పంపిణీపై చేపట్టిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో 85.64 శాతం మంది సానుకూలంగా స్పందించారు. 25 సచివాలయాల పరిధిలో 14.26 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు. ఇకపై శతశాతం సానుకూల స్పందన వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

శ్రీనివాసపాణి, పీడీ, డీఆర్‌డీఏ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement