● జిల్లా వ్యవసాయాధికారి
వి. తారక రామారావు
విజయనగరం ఫోర్ట్: జిల్లాపై ఎల్‌నినో ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని జిల్లా వ్యవసాయాధికారి వి. తారకరామారావు అన్నారు. బుధవారం స్థానిక జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వల్ల చాలా తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. సాధారణంగా ఆగస్టు నెలఖారు నాటికి వర్షాలు అధికంగా కురిసి చెరువులు పూర్తి స్థాయిలో నిండిపోయేవన్నారు. కాని ఈ ఏడాది వర్షాలు అశించిన స్థాయిలో లేకపోవడంతో చెరువుల్లో నీరు లేని పరిస్థితి నెలకొందన్నారు. జిల్లాలో వరి పంట సాధారణ సాగు విస్తీర్ణం 1.21 లక్షల హెక్టార్లు కాగా.. ఈ ఏడాది ఇంతవరకు కేవలం 45 వేల హెక్టార్లలో మాత్ర మే వరి సాగు చేపట్టారన్నారు. గతే డాది ఇదే సమ యానికి 85 వేల హెక్టార్లలో వరి పంట సాగైందని చెప్పారు. జిల్లాలో 8,026 చెరువులు ఉన్నాయని, వీటిల్లో 18 టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 3 టీఎంసీల నీరు మాత్రమే ఉందన్నారు. వీలైనంత వరకు వరికి బదులు ప్రత్యామ్నాయంగా చోడి, పెసర, మినప పంటలు వేసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులు దృష్ట్యా పంట రుణాలు తీసుకున్న రైతులు పంటల బీమా చేసుకోవాలన్నారు.
లక్ష్యంతో కూడిన
విద్యనందించాలి
సాలూరు: విద్యార్థులు లక్ష్యంతో కూడిన విద్యనభ్యసించాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు. మండలంలోని పీఎన్ బొడ్డవలస సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. సౌకర్యాలు, వసతి, విద్యాబోధనపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
● దుస్తులు, చేతికర్ర ఆధారంగా గుర్తింపు
● కేసు నమోదు చేసిన పోలీసులు
మెంటాడ: మండలంలోని ఆగూరు పంచాయతీ పరిధిలోని సారాడవలస గ్రామానికి చెందిన ఎర్రగడ కన్నయ్యదొర (76)అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ నెల 11వ తేదీ నుంచి ఆయన కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆండ్ర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే కంటుభుక్తవలస గ్రామం వైపు ఉన్న ఒక తోట నుంచి దుర్వాసన రావడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా..ఒక మృతదేహం కనిపించింది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో.. దుస్తులు, పక్కనే ఉన్న చేతికర్ర ఆధారంగా అది కన్నయ్యదొరేనని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎస్సై కె.సీతారాం తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమార్తె రాయవరపు లక్ష్మి ఫిర్యాదు మేరకు.. ప్రమాదవశాత్తూ మృతి చెందాడా లేక ఇంకేమైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. అదృశ్యమైన వృద్ధుడు శవమై తేలడంతో సారాడవలసలో విషాదఛాయలు అలముకున్నాయి.


