రాజాం సిటీ: వారికి అతనితో సంబంధం లేదు.. అయినా బాధ్యత మరువలేదు.. అపరిచిత వృద్ధుని చివరి శ్వాస వరకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక శ్రీకాకుళం రోడ్డులో 70 ఏళ్ల వయసున్న సూర్యనారాయణ అనే వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని సామాజిక ఆస్పత్రి పూర్వపు సూపరింటిండెంట్ కరణం హరిబాబు ఇటీవల గమనించి, వెంటనే రెడ్‌క్రాస్ సభ్యులు కొత్తా సాయిప్రశాంత్‌కుమార్, పెంకి చైతన్యకుమార్‌లకు తెలియజేశారు. వారు ఆ సమయంలో హైదరాబాద్‌లోని రెడ్‌క్రాస్ శిక్షణలో ఉండడంతో, రాజాంనకు చెందిన ఓ పాత్రికేయునికి విషయం చేరవేశారు. దీంతో ఆయన రెడ్‌క్రాస్ సభ్యుల సూచనల మేరకు వృద్ధుడ్ని ఈనెల ఒకటో తేదీన సామాజిక ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి నిత్యం పర్యవేక్షిస్తూ వైద్యసేవలు అందేలా చూశారు. అయితే చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో వృద్ధుడు బుధవారం ఉదయం మృతి చెందగా.. ఈ విషయాన్ని ఆస్పత్రి సూపరింటిండెంట్ దామోదర్ ప్రధాన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో టౌన్ సీఐ నవీన్‌కుమార్, రెడ్‌క్రాస్ సభ్యులు పెంకి చైతన్యకుమార్, కొత్తా సాయిప్రశాంత్‌కుమార్, కొత్తా అనంతరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ ప్రసాదరావు, తదితరులు అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి, మానవత్వం చాటుకున్నారు.
అత్తకు కోడలు తలకొరివి..
భామిని: అత్త మృతదేహానికి కోడలు తలకొరివి పెట్టి రుణం తీర్చుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొరమకు చెందిన వృద్ధురాలు ముద్దాడ పారమ్మ (70) బుధవారం అనారోగ్యంతో మృతి చెందింది. అయితే పారమ్మ కుమారుడు ముద్దాడ బారికి ఐదేళ్ల కిందట మృతి చెందడంతో.. తలకొరివి పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ సమయంలో కోడలు గంగమ్మ ముందుకు వచ్చి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు పూర్తి చేసింది.
పరిమళించిన మానవత్వం


